
అధికారులతో సమీక్షిస్తున్న జేసీ చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్
●జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి అర్బన్: ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, సర్వే శాఖ ఏడీ రామకృష్ణతో కలిసి రీ సర్వే పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రణాళికా బద్ధంగా పనిచేసి గడువులోపు రీ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, పరిగి మండలాలకు సంబంధించిన రికార్డులను మరోసారి సరి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఆర్ నమోదులో ఎదురయ్యే సమస్యలను జేసీ నివృత్తి చేశారు. ఒకే సర్వే నంబర్‌లో ఇద్దరి పేర్లు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, భూమి ఉన్నప్పటికీ పాస్‌పుస్తకం లేకపోతే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించాలన్నారు. గ్రామాల రికార్డులు పక్కాగా ఉండాలని, వెబ్‌ల్యాండ్, డాక్యుమెంటేషన్, తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. సర్వేలో అంకిత భావం, చిత్తశుద్ధి, సమన్వయం ఎంతో అవసరమన్నారు. తహసీల్దార్లు రీ సర్వే పనులను సకాలంలో పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్యలు, అపోహలు ఉంటే వెంటే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, డివిజన్‌స్థాయి అధికారులు, డీటీలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.

సమీక్షకు హాజరైన జిల్లా అధికారులు, సిబ్బంది