
పంట రుణాల ఖాతాలు పరిశీలిస్తున్న ఏడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన్ లిఖిత
ధర్మవరం రూరల్: ఏడీసీసీ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులంతా సకాలంలో రెన్యూవల్ చేసుకుని ప్రభుత్వం అందించే రాయితీలు పొందాలని ఆ బ్యాంక్ చైర్‌పర్సన్ లిఖిత సూచించారు. మంగళవారం ఆమె పట్టణంలోని ఏడీసీసీ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పరిధిలోని వివిధ సొసైటీల ద్వారా మంజూరు చేసిన పంట రుణాలు, రెన్యూవల్స్ గురించి ఆరా తీశారు. రైతులు సకాలంలో పంట రుణాలను రెన్యూవల్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ సురేఖరాణి, మేనేజర్ నాగార్జున, సూపర్‌వైజర్లు రహంతుల్లా, నాగవేణి, సొసైటీ సీఈఓలు నారాయణస్వామి, దామోదర్, శ్రీధర్, పృథ్వీ, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
అరిసికెరకు
సమ్మర్ స్పెషల్ రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అరిసికెరకు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అఫీసర్ సీహెచ్ రాకేష్ మంగళవారం మీడియాకు తెలిపారు. సికింద్రాబాద్ – అరిసికెర (07233/34) స్పెషల్ రైళ్లు మార్చి 30 నుంచి జాన్ 30 వరకు శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయన్నారు. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, రాయచూర్, గుంతకల్లు, ఆదోని, అనంతపురం, ధర్మవరం, యలహంక మీదుగా అరిసికెరకు చేరుతుందన్నారు. అలాగే హైదరాబాద్ – అరిసికెర (07265/66) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏప్రిల్ 4 నుంచి జాన్ 28 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు ఉంటాయని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, యలహంక, తుమకూరు మీదుగా అరిసికెరకు చేరుతుందన్నారు.
సామాజిక ఆవిష్కరణలు కావాలి
●జేఎన్‌టీయూఏ వీసీ రంగజనార్దన
అనంతపురం: ఇంజినీర్లు సమాజానికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలని జేఎన్‌టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన సూచించారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తొలిసారిగా టెక్ ఫెస్ట్ –2కే23 నిర్వహించారు. సివిల్ ఇంజినీరింగ్‌లో రేస్ 2కే23, ఎలక్ట్రికల్ విభాగం ఐ–2కే23, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం డైనమిక్స్ 2కే23, ఎలక్ట్రానిక్స్ విభాగం ఈ–మెర్జ్2కే23, కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో పిక్సెల్ 2కే23, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ఫ్యూసన్2కే23 సదస్సులు నిర్వహించారు. సదస్సులకు ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. టెక్‌ఫెస్ట్–23 సదస్సుల ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. సమస్యలను పరిష్కరించే రీతిలో నూతన అంశాలు తెలుసుకోవడానికి ఇలాంటి వేదిక దోహదపడుతుందన్నారు. విశిష్ట అతిథి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అనివార్యమని స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. అనంతరం వివిధ విభాగాల్లో సావనీర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.భవాని తదితరులు పాల్గొన్నారు.

టెక్‌ఫెస్ట్‌ను ప్రారంభిస్తున్న జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన