
స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్, డీఆర్‌ఓ
పుట్టపర్తి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో అందే ప్రతి అర్జీని గడువులోపు పరిష్కరించాలని, అందులో ఏ స్థాయి అధికారి అలసత్వం వహించినా సహించబోమని కలెక్టర్ బసంత్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు హాలులో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 190 అర్జీలు అందగా, అధికారులు వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘స్పందన’ అర్జీలను ఆయా శాఖల అధికారులు బాధ్యతగా తీసుకొని పరిష్కరించాలన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వానికి వీలులేదన్నారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపి మరోసారి అర్జీదారు జిల్లా కేంద్రం వరకూ రాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, పీఆర్ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డీసీఓ కృష్ణానాయక్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఈఓ మీనాక్షి, డీఎంహెచ్‌ఓ ఎస్‌వి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్పందనలో అందిన అర్జీల్లో కొన్ని ఇలా...
హిందూపురం మెప్మా పరిధిలో వికలాంగుల సమైక్య సంఘం డిపాజిట్ డబ్బు రూ.60 వేలు సంఘం సీఓ మురళీకృష్ణ తినేశాడని సంఘం సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే సంఘ సభ్యులకు అందాల్సిన ‘పసుపు–కుంకుమ, వైఎస్సార్ ఆసరా రెండు విడతల సొమ్మును తన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించాడన్నారు.
● తన భర్త వెంకటశివారెడ్డి మూడేళ్ల క్రితం మృతి చెందారని, ఆయన పేరుతో ఉన్న 8 ఎకరాల భూమిని తన పేరుపై బదయించాలని కోరినా, ఎవరూ పట్టించుకోవడం లేదని నల్లమాడ మండలం యర్రవంకపల్లికి చెందిన నాగమ్మ ఫిర్యాదు చేశారు. 90 ఏళ్ల వయస్సులో కళ్లు కనిపించకున్నా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● ఓడీసీ మండలం ఉంట్లవారిపల్లి సర్వే నంబర్ 401–3, 401–6లోని 6.40 ఎకరాలు తన పేరుపై ఉండగా, ఇటీవల అధికారులు మరొకరిపేరుపై పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేశారని లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
కలెక్టర్ బసంత్‌కుమార్