
ప్రమాద దృశ్యం
బొమ్మనహాళ్: ఆరుగాలం శ్రమించి పండించిన మిరపను కర్ణాటక మార్కెట్‌లో విక్రయించేందుకు వెళ్లిన ఇద్దరు రైతులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఇదే ప్రమాదంలో మరో రైతు, బొలెరో వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మృతులిద్దరూ గోవిందవాడ గ్రామానికి చెందిన వారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం గోవిందవాడకు చెందిన రైతులు దాసరి కేశన్న (27), బోయ వండ్రప్ప (74), కుమ్మరి సోమన్న తాము పండించిన 80 బస్తాల ఎండు మిరపను కర్ణాటక రాష్ట్రం బ్యాడిగ ఆర్‌ఎంసీ మార్కెట్‌లో విక్రయించేందుకు శనివారం రాత్రి తమ గ్రామానికి చెందిన వన్నూరువలి బొలెరో వాహనంలో బయల్దేరారు. అర్ధరాత్రి సమయంలో బళ్లారి – బెంగళూరు హైవేలోని తమ్మేపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం అతివేగంతో వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతులు దాసరి కేశన్న, బోయ వండ్రప్ప అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం పైన ఉన్న మరో రైతు కుమ్మరి సోమన్న, డ్రైవర్ వన్నూరువలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాంపురం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కేశన్నకు భార్య సునీత, ఇద్దరు కుమారులు, వండ్రప్పకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు రైతులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కర్ణాటకలో మిరప అమ్మడానికి
వెళ్తుండగా ప్రమాదం
మరో రైతు, బొలెరో డ్రైవర్‌కు
తీవ్ర గాయాలు

మృతులు దాసరి కేశన్న, బోయ వండ్రప్ప (ఫైల్)
