11న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

11న జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

నెల్లూరు, (లీగల్‌): జాతీయ లోక్‌ అదాలత్‌ను వచ్చే నెల 11న నిర్వహించనున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ తెలిపారు. కోర్టు హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, ఉదయగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నామని వివరించారు. సివిల్‌, క్రిమినల్‌, చెక్కు బౌన్స్‌, బ్యాంకింగ్‌, మోటార్‌ వాహన ప్రమాదాలు, మున్సిపల్‌, ప్రీ లిటిగేషన్‌ తదితర రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూలైన్‌ చేరుకుంది. స్వామివారిని 74,128 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 36,053 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.58 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

రెండు తమిళ బోట్ల

నిర్బంధం

ముత్తుకూరు(పొదలకూరు): రాష్ట్ర పరిధిలోని ససముద్ర జలాల్లో చేపల వేటను అక్రమంగా సాగిస్తున్న తమిళనాడుకు చెందిన రెండు బోట్లను నిర్బంధించామని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా తెలిపారు. మత్స్య, అటవీ శాఖలు, మైరెన్‌ పోలీసులు సంయుక్తంగా గస్తీని శనివారం నిర్వహిస్తున్న క్రమంలో కృష్ణపట్నం తీరానికి 18 కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు చెందిన రెండు మెకనైజ్డ్‌ బోట్లు రాష్ట్ర ప్రాదేశిక జలాల్లో చేపల వేటను అక్రమంగా సాగిస్తున్నారని గుర్తించారు. వీటిని వెంటనే స్వాధీనం చేసుకొని జువ్వలదిన్నె హార్బర్‌కు తరలించి, అక్కడి మైరెన్‌ పోలీసులకు అప్పగించామరు. మత్స్య సంపద పరిరక్షణతో పాటు స్థానిక మత్స్యకారుల హక్కుల కోసం గస్తీని నిరంతరం నిర్వహించనున్నామని చెప్పారు.

తడ – నెల్లూరు జాతీయ

రహదారి విస్తరణకు డీపీఆర్‌

నెల్లూరు రూరల్‌: ఎన్‌హెచ్‌ – 16లోని తడ – నెల్లూరు సెక్షన్‌, నెల్లూరు బైపాస్‌ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు సంబంధించిన డీపీఆర్‌ కోసం సేవలను షెలాడియా అసోసియేట్స్‌ కన్సల్టెన్సీ చేపట్టనుందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యమని వివరించారు. డీపీఆర్‌ తయారీ ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలను పరిశీలించనున్నారని వెల్లడించారు. జాతీయ రహదారుల పీడీ రమేష్‌ గణపతి, సీనియర్‌ డిజైన్‌ ఇంజినీర్‌ మురళి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, మేయర్‌ సుజాత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు నాగఅనూష, అరుణాదేవి, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement