● రిక్షా తొక్కుతూ కాకాణి, పర్వతరెడ్డి నిరసన
నెల్లూరురూరల్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు నగర నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వినూత్నంగా రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని డీఆర్‌ఓకు వినతి పత్రం సమర్పించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు వివిధ రూపాల్లో భారం పడుతుందన్నారు. పెరిగిన ఆయిల్ ధరల వల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన భారం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు గురించి మాట్లాడుతూనే ధరలను అమాంతం పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ తగ్గించేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే రెండేళ్లుగా కూటమి తన దుష్ట పాలనతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను మరింత పెంచిందని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్ రూ.113 దాటగా, డీజిల్ రూ.103కు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలతో గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయని, సామాన్యుడి జీవనం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను అధిక ధరలకు కొనుగోలు చేసే పరిస్థితికి నెట్టేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు పెరిగిపోయాయని, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ చేపడుతున్న ప్రజా పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తే కూటమి పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థమవుతుందన్నారు. పెట్రో మంట వల్ల సామాన్యుడి జీవనం అతలాకుతలం అవుతందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.


