మైనింగ్‌తో పేదల జీవనం వినాశనం | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌తో పేదల జీవనం వినాశనం

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

నెల్లూరురూరల్‌: సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న గ్రావెల్‌, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో పేద ప్రజల జీవనాధారాలు నాశనమవుతున్నాయని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కడుపు కొట్టి, వారి జీవనాధారాన్ని కూల్చేసి.. మాఫియాలు బొక్కసాలు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్‌, రవాణాతో నిండు ప్రాణాలు బలైపోతున్నా.. కనీసం మానవత్వం లేకుండా యథేచ్ఛగా సహజ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్వేపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం తాను కందలపాడు గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ మైనింగ్‌ మాఫియా దోపిడీ తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. తరతరాలుగా వరి, నిమ్మ తోటలు, చిన్న చిన్న కూరగాయల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేద రైతుల భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ దోపిడీకి జరుగుతుందని, సోమిరెడ్డి గ్రావెల్‌ ముఠా కందలపాడు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందన్నారు. కందలపాడులో మైనింగ్‌ సంబంధించి గత నెల 30వ తేదీతో ముగిసిపోయిందని, అయినా మైనింగ్‌ను ఎందుకు సాగిస్తున్నారని నిలదీశారు. అక్రమ మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కందలపాడు మైనింగ్‌లో సోమిరెడ్డికి 40 శాతం వాటా ఉందని, నెలకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు వాటా వెళ్తుందన్నారు. సోమిరెడ్డి అవినీతిని తాను వెల్లడించి... ప్రమాణం చేయమని అడిగా చేయలేదన్నారు.

ఏఎంఆర్‌ సంస్థ ఇష్టారాజ్యం

జిల్లాలో నిబంధనలు, అనుమతులతో సంబంధం లేకుండా ఏఎంఆర్‌ సంస్థ ఇష్టారాజ్యంగా నేరుగా రాయల్టీ వసూలు చేస్తోందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు నెలవారీ ముడుపులు చెల్లించడానికే ఏఎంఆర్‌ సంస్థ దోపిడీకి పాల్పడుతుందన్నారు. పేదవాడు తన పొలానికి ఒక ట్రిప్పు మట్టి తోలుకోవాలన్నా లేదా ఇళ్ల నిర్మాణానికి లెవలింగ్‌ చేసుకోవాలన్న సామాన్యులను పీడిస్తోందన్నారు. మైనింగ్‌ అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తాటి చెట్టు లోతు గుంతలు తవ్వేస్తున్నారని, వాటిల్లో పడి జంతువులు, మనుషులు, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఏఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు తమ వాహనాలకు పోలీస్‌ స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారని, మైనింగ్‌, పోలీస్‌ అధికారులకు ఉండాల్సిన అధికారాలను తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డగించి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అక్రమాలు చేస్తున్న ఏఎంఆర్‌ సంస్థపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.

ఇసుక రీచ్‌ల్లో

పెట్రోల్‌ బంక్‌ క్యూఆర్‌ కోడ్‌తో దోపిడీ

జిల్లాలో అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, తెలుగురాయపురం, రాజుపాళెం ఇసుక రీచ్‌ల దగ్గర నుంచి, సర్వేపల్లి నియోజకవర్గంలోని విరువూరు, సూరాయపాళెం ఇసుక రీచ్‌ల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారని కాకాణి ఆరోపించారు. విరువూరు ఇసుక రీచ్‌లో సంగం పెట్రోల్‌ బంకుకు సంబంధించిన ఫోన్‌పే క్యూఆర్‌ కోడ్‌ని పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దోపిడీ ముఠాలతో పాటు, అధికారుల ఆగడాలపై ఆధారాలతో సహా లోకాయుక్త, గ్రీన్‌ ట్రిబ్యునల్‌, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై పోలీసు కేసులు పెట్టడం ద్వారా తమను కంట్రోల్‌ చేయడం సాధ్యం కాదని తెలియజేస్తామన్నారు. జిల్లాలో ఉన్న అధికారులు అవినీతి, అక్రమాలను అరికట్టడం మానేసి, వాటిని ప్రశ్నించే వారిని అణచివేయాలని చూడడం మూర్ఖత్వమే అవుతుందన్నారు.

ప్రాణాలు పోతున్నా పట్టదా?

సూరాయపాళెం ఇసుక రీచ్‌లో క్వారీ నిర్వాహకుల నిర్వాకం వల్ల ఇసుక గుంతలో పడి ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యకి చనిపోతే, పోలీసులు దాన్ని కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అదే ఇసుక రీచ్‌లో గోదావరి జిల్లాకు చెందిన ఒక కూలీ కూడా బలయ్యాడు. ఆ రెండు కుటుంబాలు నేడు వీధిన పడ్డాయన్నారు. ఈ ఘటనలను పోలీసులు మసిపూసి మారేడుకాయ చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

పేద రైతుల భూముల్లో గ్రావెల్‌ మాఫియా రాబందులు

సోమిరెడ్డి అవినీతి దాహం తీరడం లేదు

నిండు ప్రాణాలు బలిగొంటున్న గ్రావెల్‌, ఇసుక, మట్టి అక్రమ రవాణా

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం

అక్రమ మైనింగ్‌పై చర్యలకు మైనింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతి

Advertisement
 
Advertisement
Advertisement