డాలర్ల పంటగా ఖ్యాతిగడించిన ఆక్వా రంగం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంక్షోభంలో పడింది. రాబోయే సీజన్ నాటికి ఆక్వా సాగుపై క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయి. అప్సడా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అండతో ఫీడ్ యాజమాన్యాలు ధరలు పెంచడంతో ఈ ప్రభావం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఒకప్పుడు లక్షాపాతిక వేల ఎకరాల్లో సాగవుతుంటే.. ప్రస్తుతం మూడో వంతుకు పడిపోయింది. తాజాగా నాలుగైదు రోజులుగా ఫీడ్ ధరలు పెరగడంతో ఖర్చులు భరించలేక తక్కువ కౌంట్‌లోనే పట్టేస్తున్నారు. ఒక పక్క ధరల పెరుగుదలను తాత్కాలికంగా నిలిపివేశామని చెబుతున్నా.. వ్యాపారులు మాత్రం పెరిగిన ధరలతోనే రైతులకు విక్రయిస్తున్నారు.
వాకాడు : ఏపీలోని ఆక్వా ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ టీడీపీ నేతలు చేతుల్లో ఉండడంతో వీరి కన్ను ఆక్వా రైతులపై పడింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వీరు రొయ్యల ధరలను తగ్గించేశారు. తాజాగా రా మెటీరియల్ ధరలు పెరిగాయంటూ టన్నుకు రూ.10 వేల లెక్కన పెంచేసి దోపిడీకి తెర తీశారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చాక ధాన్యం నుంచి పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల ధరల వరకు పాతాళానికి పడిపోయాయి. ఇక చేపల ధరలు కూడా తగ్గిపోయాయి. రొయ్యల మేతలో వినియోగించే చేపలు, సోయాబీన్, గోధుమలు, మొక్కజొన్నలు, రొయ్యల వేస్ట్, కొవ్వు నూనెలు సైతం ధరల పతనం కోవలోనే ఉంటే.. రా మెటీరియల్ ధరలు ఎక్కడ పెరిగాయో అర్థం కావడం లేదని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు.
దిగుమతి సుంకాలు తగ్గించినా..
ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకు దిగుమతుల సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించగా కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా సుంకాన్ని మినహాయించింది. అంటే ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15 వేలు నుంచి రూ. 20 వేలు వరకు తగ్గాల్సి ఉంది. కాని ఆయా కంపెనీలు యుద్ధాన్ని బూసిగా చూపి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
అప్సడా అనుమతి అవసరం
ఫీడ్, సీడ్ ధరలు పెంచాలంటే అప్సడా (ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒక వేళ ధరల పెంపు అనివార్యమైనప్పడు ఆక్వా రైతుల సంఘాల నేతలతో సమావేశమై వారి అంగీకారంతో ధరలు పెంచాలి. కాని చంద్రబాబు ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో కుమ్మకై ్క అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసి ఏక పక్షంగా ధరలు పెంచేందుకు అనుమతులు ఇవ్వడంపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండానే టన్నుపై రూ.4 వేలు ధరలు పెంచారు. దీంతో జిల్లాలో వెనామీ ఫీడ్ టన్ను రూ.87 వేలు ఉండగా, టైగర్ ఫీడ్ టన్ను రూ.98 వేలుగా ఉండగా తాగాజా టన్నుపై మరో రూ.10 వేలు లెక్కన పెంచారు. కూటమి అధికారంలో ఉండడంతో అప్సడాతో మాకేం పనంటూ ఫీడ్ యాజమాన్యాలు దోపిడీకి తెరతీశాయి. ఒక పక్క దీనిపై చర్చించిన తర్వాతనే ధరలపై నిర్ణయం తీసుకుంటామంటూనే మరో పక్కన పెంపును అమల్లోకి తెచ్చారు.
రొయ్యల ధరలు పతనం
ప్రకృతి వైపరీత్యాలతో తగ్గుతున్న దిగుబడులు, సాగులో పెరుగుతున్న ఉత్పాదక వ్యయం వెరసి ఆక్వా రైతులు సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ సుంకాలు, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం సాకుగా చూపి కొందరు పచ్చ నేతలు సిండికేట్ వ్యాపారులుగా మారి ఆక్వా సాగును నిలువునా దోసుకుంటున్నారు. ఓ పక్క నాసిరకం సీడ్‌తోపాటు, మరో పక్క పెరిగిన ఫీడ్ ధరలు, ప్రకృతి వైపరీత్యాలతో రొయ్య రైతులు తల్లడిల్లుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంతో ఆక్వా రైతులు మండి పడుతున్నారు. ఆక్వా సాగులో ఒక టన్ను రొయ్యలు ఉత్పత్తి చేయాలంటే రైతులు 90 రోజులు రొయ్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందులో ఫీడ్, సీడ్, కెమికల్స్, ఏయిరేటర్స్ కరెంట్ బిల్లులు, జనరేటర్, ఫీడింగ్ కూలీలు, తదితర పరికరాల కొనుగోలు, లీజులతో కలిపి దాదాపు రెండు ఎకరాల చెరువుకు రూ. 2.60 లక్షల వరకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ఉన్న రొయ్యల ధరలతో సరి చూసుకుంటే ఎకరాకు రూ. 20 వేలు నుంచి రూ.30 వేలు వరకు నష్టం వాటిల్లుతోంది. నాసిరకం సీడ్ చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్యి పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. దీంతో సాగులో మరింత నష్టం చవి చూడాల్సి వస్తుంది.
జిల్లాలో ఏడాదికి రూ.2,500 కోట్ల వ్యాపారం
ఉమ్మడి నెల్లూరు జిల్లా తీరం వెంబడి 12 మండలాల్లో ప్రస్తుతం 45 వేల ఎకరాలకు సాగు జరుగుతోంది. ఏడాదికి లక్ష టన్నుల రొయ్య ఉత్పతి జరుగుతోంది. టన్ను ఉత్పత్తికి రెండున్నర టన్నుల మేతను వినియోగించాల్సి ఉంది. సగటున ఏడాదికి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మేతను రైతులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఏడాదికి రూ.2500 కోట్లు ఫీడ్ వ్యాపారం జరుగుతుంది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం చూస్తే ఇదే స్థాయిలో ఆక్వా సాగు జరిగితే.. ఏడాదికి రూ.250 కోట్ల అదనపు భారం పడుతోందని అంచనా.
టన్నుకు మూడు నెలల్లో రూ.14 వేల వరకు పెంపు
రొయ్యల ధరలు చూస్తే
పాతాళానికి పతనం
ఈ పరిస్థితుల్లో మేత కొనుగోలు చేయలేక తక్కువ కౌంట్‌లోనే పట్టేస్తున్న రైతులు
జిల్లాలో ఏడాదికి
రూ.2500 కోట్ల ఫీడ్ వ్యాపారం
తాజాగా పెరిగిన ధరల ప్రకారం రూ.250 కోట్ల అదనపు భారం
ఆక్వా రంగం అతలాకుతలం
రొయ్యల ధరలు
చిల్లకూరు: ఆక్వా ఫీడ్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రైతులు నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓ ఫీడ్ కంపెనీ నిర్వాహకులు చిల్లకూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు, కోట మండలాలకు చెందిన ఆక్వా సాగుదారులు కార్యక్రమం పూర్తయిన తర్వాత హోటల్ బయట నల్లబాడ్జీలు ధరించిన నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఆక్వా సాగు రెండేళ్లుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోందని, దీంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో ఫీడ్ యాజమాన్యాలు టన్నుపై రూ.10 వేల వరకు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే మూడు నెలల క్రితం టన్నుపై రూ.4 వేల పెంచడంతో భారాన్ని మోస్తున్నామని, అంతలోనే మరోసారి అధికంగా ధులు పెంచేందుకు పూనుకోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఫీడ్ పరిశ్రమల వారితో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి ధరలను తగ్గించడంతోపాటు రొయ్యల ధరలు పెరుగుదలకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


