నిమ్మ ధరలు పతనం | - | Sakshi
Sakshi News home page

నిమ్మ ధరలు పతనం

May 2 2026 11:37 AM | Updated on May 2 2026 11:37 AM

పొదలకూరు: నిమ్మ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతులు పెరగడంతోపాటు రైతులు నాణ్యమైన కాయలను మార్కెట్‌కు తీసుకురాకపోవడం కారణాలుగా వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కిలో రూ.175 నుంచి రూ.145 పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు కిలో రూ.70 నుంచి రూ.145 వరకూ పలుకుతోంది. ఈ ఏడాది కాయల ధరలు బాగా పెరిగింది. బస్తా టాప్‌ ధర రూ.15 వేలకు వెళ్లింది. రెండు రోజుల క్రితం వరకు బస్తా రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు అమ్ముడైంది. అయితే ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు ఢీలా పడ్డారు. ధరలు బాగా పెరిగినప్పుడు పిందెలను కూడా కోయించి మార్కెట్‌కు తరలించేవారు. అయితే గురువారం పరిస్థితి మారిపోవడంతో రైతులు ఉసురూమంటూ తక్కువ ధరకే కాయలను అమ్ముకోవాల్సి వచ్చింది.

గడ్డుకాలమే..

రానున్న రోజుల్లో నిమ్మ ధరలకు గడ్డుకాలమే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలో ఏలూరు, తెనాలి తదితర పెద్ద మార్కెట్లు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి ఎగుమతులు చేస్తుండటంతో ఇక్కడి కాయలకు డిమాండ్‌ తగ్గుతుంది. దీంతో ధరలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు సైతం కాయలను వేలంవెర్రిగా మార్కెట్‌కు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. పిందెలను కోయడం తగ్గిస్తారనే అభిప్రాయం నెలకొంది. ఢిల్లీ మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతులు బాగా పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఇక్కడ డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గిపోతాయంటున్నారు. అయితే ఈ ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగా ధరలు పలికాయి.

ఒక్కసారిగా కిలో

రూ.30 తగ్గిన వైనం

ఇతర ప్రాంతాల నుంచి పెరిగిన ఎగుమతులు

నాణ్యమైన కాయలు రావడం లేదంటున్న వ్యాపారులు

ఎగుమతులు పెరిగాయి

బయటి రాష్ట్రాల నుంచి కాయల ఎగుమతులు పెరిగాయి. దీంతో ఇక్కడ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. భవిష్యత్‌లో సైతం ధరలు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. నాణ్యత కలిగిన కాయలను రైతులు మార్కెట్‌కు తీసుకురావడం లేదు. ఫలితంగానే వారు ఆశించిన ధరలు గిట్టుబాటు కాలేదు.

– ఎం.బాలకృష్ణారెడ్డి, నిమ్మ వ్యాపారి, పొదలకూరు యార్డు

Advertisement
 
Advertisement
Advertisement