కావలి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. టీడీపీ నాయకుల అండదండలతో కావలి పెద్దచెరువును కొల్లగొడుతున్నారు. అక్రమంగా గ్రావెల తవ్వకాలు చేపడుతూ పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు ఇంత వరకు ఒక్క వాహనం పట్టుకుని జరిమానా విధించిన దాఖలాలు లేవు. కూటమి నాయకులు, కార్యకర్తలే సూత్రధారులుగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కావలి నియోజకవర్గంలో 130 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వందల కోట్ల రూపాయలను గడించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కొన్నిరోజులుగా విజిలెన్స్ విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ సాగుతుండగానే మరోవైపు దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్లకు కావలి పెద్దచెరువు నుంచి యంత్రాల సాయంతో రేయింబవళ్లు అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గత రెండు,మూడు రోజులుగా కావలి పెద్దచెరువు నుంచి వందల టిప్పర్ల గ్రావెల్‌ను తరలిస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడలేదు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ మీదుగానే నిత్యం తరలివెళ్తున్నా కనీసం పోలీసులు అధికారులు కూడా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కావలి పెద్దచెరువులో గ్రావెల్ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.
దేవదాయ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలు
వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీ సమీపంలోని దేవదాయశాఖకు చెందిన సీతమ్మ సత్రం భూముల్లో కొందరు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ టిప్పర్ల ద్వారా రైల్వే పనులకు తరలిస్తున్నారు.గ్రావెల్ తవ్వకాలతో ఇందిరమ్మకాలనీ సమీపంలో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా నిర్వాహకులు లెక్క చేయడం లేదు. గ్రావెల్ గుంతల్లో చిన్నారులు, గేదెలు పడి చనిపోయే ప్రమాదం ఉందని స్థానికులు మొరపెట్టుకుంటున్నా వినిపించుకోవడం లేదు. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ట్రక్కు గ్రావెల్‌ను తరలించే ప్రయత్నాలు చేసినా వెంటనే అధికారులు వాలిపోయి అడ్డుకుంటున్నారు. కానీ టిప్పర్లతో నిరంతరం గ్రావెల్‌ను అక్రమ రవాణా చేసే వారి జోలికి వెళ్లకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


