కోట: స్థానిక ఎన్‌సీఆర్ నగర్ వద్ద ఉన్న ఓ మార్ట్‌లో మంగళవారం వివాదం చోటుచేసుకుంది. కొక్కుపాడు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి అక్కడ ఓ కంపెనీ కూల్‌డ్రింక్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో పురుగులు కనిపించినట్లు బాధితుడు తెలిపాడు. దీనిపై మార్ట్ సిబ్బందిని నిలదీయడంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నాడు. బాటిల్‌ను తిరిగిచ్చేయాలని మరొకటి ఇస్తామని చెప్పడంతో అతను ససేమిరా అన్నాడు. మార్ట్‌లో పనిచేసే సిబ్బంది బాటిల్ బయటకు వెళ్లకుండా అతడి వద్ద నుంచి లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్ బాటిల్ తన వద్దే ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మురళి తెలిపాడు.
అంగన్‌వాడీ కేంద్రంలో
రికార్డుల పరిశీలన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని జైభీమ్ నగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి హేనాసుజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు జైభీమ్ నగర్ కాలనీకి వస్తున్న నేపథ్యంలో ఆమె వచ్చి రికార్డులు పరిశీలించి కార్యకర్తలకు పలు సూచనలిచ్చారు. ఆమె వెంట సీడీపీఓ పద్మజాకుమారి, సూపర్‌వైజర్లు ఉన్నారు.
రైలు ఢీకొని..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
కోవూరు: రైలు ఢీకొట్టడంతో గుర్తుతెలియని మృతిచెందిన ఘ టన మండలంలోని పడుగుపాడు రైల్వేస్టేషన్ పరిధిలో ఇనమడుగు గేటు వద్ద మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సుమారు 40 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని చనిపోయాడు. అతని చేతికి సైలెన్ ఎక్కించేందుకు ఉపయోగించే కాన్యులా ఉండటాన్ని గుర్తించారు. దీన్ని బట్టి సదరు వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడని, అక్కడి నుంచి వెళ్తూ చనిపోయి ఉంటాడని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రావెల్స్ బస్సుల్లో
తనిఖీలు
నెల్లూరు(టౌన్): రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో జిల్లా రవాణాశాఖాధికారులు అప్రమత్తయ్యారు. మంగళవారం రాత్రి డీటీసీ బి.చందర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్ ప్రదేశాల్లో రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను నిలిపివేశారు. తనిఖీల్లో ఎంవీఐలు బాలమురళీకృష్ణ, రఫీ, పవన్ కార్తీక్, గోపీనాయక్, ఏఎంవీఐలు ప్రభాకర్, రఘునాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
రోగులకు నాణ్యమైన
వైద్యసేవలు
చేజర్ల: వైద్యారోగ్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి సూచించారు. మండలంలోని చేజర్ల, చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోజూ ఓపీలో 50 మంది రోగులు తగ్గకుండా చూడాలని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు మెహతాబ్ తదితరులు పాల్గొన్నారు.


