● టీడీపీ ఎంపీటీసీ సభ్యుడి నిర్వాకం
● ఇంటి కిటికీలు, ఎలివేషన్ ధ్వంసం
● అడ్డొచ్చిన వారిపైనా దాడి
కొడవలూరు: అధికారం అండ చూసుకుని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారైతే చాలు అనవసర విషయాల్లోనూ జోక్యం చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు కొడవలూరు మండలం యల్లాయపాళెంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన అద్దం పడుతోంది. వివరాలిలా ఉన్నాయి. యల్లాయపాళేనికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు తాటిపర్తి భాస్కర్ సొంత పనులపై కారులో సోమవారం బుచ్చిరెడ్డిపాళేనికి వెళ్లాడు. అదేరోజు రాత్రి తిరిగి ఇంటికొస్తున్నాడు. ఊరి మొదట్లో పరిచయస్తుడైన ట్రాక్టర్ డ్రైవర్ శేషయ్య కనిపించగా కారు నిలిపి మాట్లాడుతున్నాడు. వెనుకనే కారులో వచ్చిన టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజేంద్ర హారన్ కొట్టాడు. దీంతో కారును పక్కకు తీసినా దుర్భాషలాడారని భాస్కర్ తెలిపాడు. తదుపరి భాస్కర్ ఇంటికెళ్లిపోయాడు. రాజేంద్ర తన అనుచరులైన కోలగట్ల సుమంత్, కోలగట్ల సుకుమార్‌తో కలిసి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కర్రలు, రాళ్లతో భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. కిటికీలు, ఎలివేషన్ అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు అడ్డొచ్చిన భాస్కర్ భార్య సునీత, కుమార్తైపెనా చేయి చేసుకున్నారు. బాధితులు మంగళవారం కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిపై దాడికి పాల్పడిన రాజేంద్రపై రౌడీషీట్ కూడా ఉన్నందున తమ ప్రాణాలకు హాని ఉందని పేర్కొన్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


