బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉభయదేవేరులతో కలిసి పుష్కరిణిలో శనివారం రాత్రి జలవిహారం చేశారు. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కారణంగా పుష్కరిణిలో తెప్ప ఈ నెల నాలుగున ఒరిగిపోయి ఉత్సవం ఆగిపోయిన విషయం విదితమే. ఈ తరుణంలో భక్తులతో పాటు కొండబిట్రగుంట, పాతబిట్రగుంట గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవడంతో ఆగమ పండితుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలతో తెప్పోత్సవాన్ని మరోసారి నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ ఉభయదేవేరులు, స్వామివారిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు అర్చక బృందం తీసుకొచ్చారు. వివిధ రకాల పుష్పాలు, పట్టు పీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని కొలువుదీర్చి జలవిహారం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.
వెబ్‌సైట్‌లో
సీనియార్టీ జాబితా
నెల్లూరు (టౌన్): జోన్ – 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్ – 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను deognt.blogspot.co mలో అందుబాటులో ఉంచామని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 13లోపు అందజేయాలని కోరారు.
వేగవంతంగా
గృహ నిర్మాణాలు
నెల్లూరు(అర్బన్): గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పక్కా గృహాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా మంజూరైన గృహ నిర్మాణాలతో పాటు పెండింగ్‌లో ఉన్న వాటిని నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆప్షన్ – 3 కింద గుర్తించిన నాణ్యత లేని నిర్మాణాలను వెంటనే కాంట్రాక్టర్లతో సరిచేయించాలని సూచించారు. పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి పీడీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులతో
టెలి కాన్ఫరెన్స్
నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల్లో పొదుపు మహిళల సేవలను వినియోగించుకొని వారి ద్వారా ఇంటి పన్నులను వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆదివారం సెలవైనా, కార్య దర్శులు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేయా లని పేర్కొన్నారు.


