దోమల దండయాత్ర | - | Sakshi
Sakshi News home page

దోమల దండయాత్ర

Jan 30 2026 6:45 AM | Updated on Jan 30 2026 5:01 PM

-

నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తం

రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, ప్రయోజనం శూన్యం

పూడికను తొలగించేవారేరీ..?

చెత్తాచెదారాలతో నిండిపోయిన పంట కాలువలు

మురుగు ప్రవహించే దారిలేక రోడ్లపైకి చేరుతున్న వైనం

మస్కిటోల బెడదతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న ప్రజలు

నెల్లూరు నగరానికి నిద్ర కరువైంది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో మురుగు ఆవాసాలుగా దోమలు ప్రబలి దండయాత్ర చేస్తున్నాయి. రాత్రుళ్లు కునుకు తీస్తే ఒట్టు అన్నట్టుగా పరిస్థితి మారింది. పగలూ కుట్టి పెడుతుండటంతో నగర ప్రజలకు ప్రశాంతత కరువైంది. 

నెల్లూరు (బారకాసు): నగరాన్ని మురుగు రహితంగా మారుస్తామంటూ 2019కు ముందే అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ రూ.వందల కోట్ల ఖర్చు పెట్టి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టినా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. నగర నియోజకవర్గ పరిధిలోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినా, ఏ మాత్రం ఉపయోగంలేదు. కాలువలు సైతం చెత్తాచెదారాలతో నిండిపోవడంతో మురుగు పారుదల లేక రోడ్లపైనే ప్రవహిస్తోంది. బురద (సిల్ట్‌)ను తొలగించకపోవడంతో దుర్ఘంధం వెదజల్లుతోంది. ఇవి దోమల ఉత్పత్తికి ఆవాసాలుగా మారుతున్నాయి. దోమలు అధికమై నగర ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. వీటితో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పగలు సైతం కుట్టిపెడుతున్నాయంటే దోమల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దోమల ధాటికి ప్రజలు డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చెత్తను తొలగించకపోవడంతో అంటురోగాలు ప్రబలుతున్నాయి. మరికొన్ని పంట కాలువల్లో సిల్ట్‌ను తొలగించకపోవడంతో వాటిల్లో చెత్తాచెదారం నిల్వ చేరి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కాలువలకు ఇరువైపులా ఉండే నివాసాల్లోకి మురుగు ప్రవహిస్తోంది.

తప్పుడు లెక్కలతో నిధుల స్వాహా

అధికారులు మాత్రం నిత్యం ప్రతి కాలువను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శుభ్రం చేస్తున్నట్లు రికార్డుల్లో పొందుపరుస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లుండగా, 167 సచివాలయాలున్నాయి. 150 కిలోమీటర్ల మేర విస్తీర్ణం గల నగరంలో 1,83,643 గృహాలున్నాయి. దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. చెత్త సేకరణకు 165 వాహనాలున్నాయి. చెత్త తొలగించడంతో పాటు వీధులు, కాలువలను శుభ్రం చేసేందుకు 1350 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వీరితో పాటు నలుగురు శానిటరీ సూపర్‌వైజర్లు, ఆరుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు హెల్త్‌ అసిస్టెంట్లు, 131 మంది వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలు, 24 మంది పబ్లిక్‌ హెల్త్‌ మేసీ్త్రలూ ఉన్నారు. ఆయా వాహనాలతో నిత్యం ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరిస్తూ డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. మరో వైపు రోడ్లు ఊడుస్తూ కాలువలను శుభ్రం చేస్తారు. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని పరువురు ఆరోపిస్తున్నారు. మూడు పూటలా ఫినాయిల్‌, బ్లీచింగ్‌, ఆయిల్‌ బాల్స్‌ వినియోగిస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడా దోమల నివారణకు చర్యలు చేపడుతున్న దాఖలాల్లేవు. మొక్కుబడి చర్యలు, ప్రచారార్భాటాలు మాత్రమే కనబడుతున్నాయి. దోమల నియంత్రణ పేరుతో భారీనే ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు రాసుకొని, కాసులను నొక్కేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఇలాకాలోనే దోమలు దండయాత్ర చేస్తుండటం విశేషం.

అనారోగ్యంతో ప్రజలు విలవిల

పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో నగర ప్రజలు అనారోగ్యంతో విలవిల్లాడుతున్నారు. మురుగు నీరు నిల్వ చేరడంతో దోమల ఉత్పత్తి అధికమైంది. దీంతో దోమలు ఇళ్లల్లో కి చేరడంతో వాటి కాటుతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అనేక మంది దోమకాటుతో డెంగీ మలేరియా వంటి విషజ్వరాల బారిన పడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దోమల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు జెట్‌ కాయిల్స్‌, ఆలౌట్‌, గుడ్‌నైట్‌ వంటి లిక్విడ్స్‌ వాడకం కోసం నిత్యం వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం కానరావడంలేదు.

కార్పొరేషన్‌ కార్యాలయంలోనే స్వైర విహారం

నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌ వద్ద ఉదయం 10.30 గంటల సమయంలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో కార్యాలయ సిబ్బంది వాటిపై బ్యాట్‌తో దండయాత్ర చేస్తున్నారంటే నగరంలో దోమల బెడద ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల వార్డుల్లో ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కార్పొరేషన్‌ పరిధిలోని ప్రతి ఏరియాలో దోమల తీవ్రత ఎక్కువగా ఉందని నగర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement