యూరియాకూ సిఫార్సులేనా..?
నెల్లూరు(పొగతోట): ప్రస్తుత టీడీపీ పాలనలో సిఫార్సులున్న ఏజెన్సీలు, రైతులకే యూరియా బస్తాలందుతున్నాయి. ఆరెస్కేల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకే సరఫరా చేస్తున్నారు. కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి ఆరెస్కేకు అందజేయాల్సిన యూరియాను కుల్లూరులో నిల్వ చేశారు. చింతలపాళెంలోని రైతు సేవా కేంద్రంలో కూటమి నేత కూర్చొని వారికి అనుకూలంగా ఉండే రైతులకే పంపిణీ చేశారు. తెలుగురాయపురంలో ఇవి అందక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు.
ఆర్థికంగా నష్టపోతూ..
రూ.266కు విక్రయించాల్సిన యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.420కు కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నారు. కొండాపురం మండలం సాయిపేటలోని ఆరెస్కేకు సరఫరా చేయాల్సిన దాన్ని కూటమి నేతల సిఫార్సులతో ప్రైవేట్ ఏజెన్సీలకు తరలించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అనంతసాగరం మండలంలో సైతం అందక రైతులు అల్లాడిపోతున్నారు. యూరియాను సరఫరా చేయకపోతే రోడ్లెక్కి ధర్నాలకు దిగుతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిఫార్సులకే సై..
కూటమి నేతల సిఫార్సులకు అధికారుల సైతం వంతపాడుతుండటంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు చూపుతున్న లెక్కలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య ఏ మాత్రం పొంతన ఉండటంలేదు. కలువాయి మండలానికి సంబంధించి 130 శాతం మేర పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు వీటి కోసం రైతులు ఎందుకు పరుగులు తీస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు.
ఇదీ తంతు..
జిల్లా వ్యాప్తంగా 5.6 లక్షల ఎకరాలకుపైగా వరిని సాగు చేస్తున్నారు. 94,383 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలేశారు. దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు 76 వేల మెట్రిక్ టన్నులను పంపిణీ చేశారు. 12 వేల మెట్రిక్ టన్నుల మేర జిల్లాలో అందుబాటులో ఉందని చెప్తున్నారు. దగదర్తి మండలంలో రూ.420కు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇస్తున్నారు. పెద్ద గోదాముల్లో బస్తాలను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదెక్కడి చోద్యమో..!
పేరుకే ఆరెస్కేలు.. ఏజెన్సీలకే తరలింపు
అందక రైతుల ఆందోళన
కాగితాలకే పంపిణీ ప్రక్రియ పరిమితం
రవాణా పేరిట దోపిడీయే
సరికొత్త దోపిడీ
యూరియా బస్తాల రవాణా పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి యూరియాను తీసుకొచ్చామంటూ రవాణా పేరుతో రైతుల నుంచి ఏజెన్సీలు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇలా బస్తాకు రూ.70 నుంచి రూ.100 వరకు దగా చేస్తున్నారు. ఒకవేళ రైతులు ప్రశ్నిస్తే, అధికంగా వసూలు చేయాలని వ్యవసాయాధికారులు చెప్పారనే సమాధానమొస్తోంది. ఏదిఏమైనా టీడీపీ పాలనలో యూరియా కోసం రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.


