లడ్డూపై దుష్ప్రచారంలో నిజమే గెలిచింది
వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట టెంకాయలు కొడుతూ..
నెల్లూరు రూరల్: తిరుమల లడ్డూ ప్రసాదంపై కొంతకాలంగా జరుగుతున్న దుష్ప్రచారంలో నిజమే గెలిచిందని.. అసత్య ప్రచారాలు, అర్థరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో గల వెంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, భక్తులతో కలిసి గురువారం ప్రత్యేక పూజలు చేసి టెంకాయలను కొట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. టీటీడీకి పంపిన నెయ్యి నమూనాల్లో ఎక్కడా పంది కొవ్వు లేదా ఇతర జంతువుల కొవ్వు ఆనవాళ్లు కనిపించలేదని ఎన్డీఆర్‌ఐ కర్ణాల్ నివేదిక నిగ్గుతేల్చిందని చెప్పారు. అధర్మాన్ని అణిచి, భక్తుల నమ్మకాన్ని కాపాడిన ఏడుకొండలస్వామి సాక్షిగా నిజం తెలిసిందని వివరించారు. లడ్డూ ప్రసాదంపై జరిగినవన్నీ అసత్య ప్రచారాలేనని సీబీఐ నివేదికతో తేలిపోయిందని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేవలం రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. శ్రీవారి పవిత్రతను తాకట్టు పెట్టి చంద్రబాబు అల్లిన అబద్ధాల కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని.. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అబద్ధపు ప్రచారాల నుంచి భక్తుల నమ్మకాన్ని కాపాడారని వివరించారు. గత ప్రభుత్వంపై కావాలనే బురద జల్లారని, ఇప్పుడు నివేదికలతో నిజం బట్టబయలైందని వివరించారు. పవిత్రమైన లడ్డూపై లేనిపోని అనుమానాలను రేకెత్తించి.. భక్తులను ఆందోళనకు గురిచేసి వారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. లడ్డూలో పంది కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలిందని, పవన్ కల్యాణ్ దీనికి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. భక్తులను తప్పుదోవ పట్టించిన ఆయన ఏ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నా.. పాపపరిహారం సరిపోదన్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్ చేసిన హడావుడి కేవలం రాజకీయ డ్రామాలేననే విషయం నివేదికతో స్పష్టమైందని చెప్పారు. పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని.. నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించిన ఆయన సీబీఐ నివేదికపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భక్తులకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉందని తేలడంతో భక్తులు ఊపిరి పీల్చు కుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఇప్పటికై నా మంచి బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నామని తెలిపారు. అనంతరం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుర్మార్గమైన ఆలోచనలతో అసత్య ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. తప్పును అంగీకరించి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కొంతకాలంగా అసత్య ప్రచారాలు
అర్థ్ధరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని నిగ్గుతేల్చిన సీబీఐ నివేదిక
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటేశ్వరస్వామి ఆలయంలో
పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు
లడ్డూపై దుష్ప్రచారంలో నిజమే గెలిచింది


