విద్యార్థులపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
● నెల్లూరు రూరల్ డీఎస్పీ
ఘట్టమనేని శ్రీనివాసరావు
నెల్లూరు సిటీ: పదో తరగతి విద్యార్థులను కత్తులతో బెదిరించి, దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కోడూరుపాడు గ్రామానికి చెందిన శుషాంత్ ఓ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 26వ తేదీన పాఠశాలలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని తిరిగి స్నేహితులతో కలిసి ఇంటికెళ్తున్నాడు. ఈ క్రమంలో కాకాణి రాకేష్ అలియాస్ రాఖీ, బోడెద్దుల శ్రీనివాసులు, మరో బాలుడు బైక్‌పై వెళ్తూ విద్యార్థులకు అడ్డు తగిలారు. చూసుకుని వెళ్లాలని శుషాంత్ చెప్పడంతో బైక్ ఆపి వారి వద్దకు వచ్చారు. గతంలో వారి మధ్య పాతగొడవలున్న నేపథ్యంలో వాగ్వాదం జరిగింది. విద్యార్థులపై రాఖీ, శ్రీనివాస్, బాలుడు భౌతికంగా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఫోన్ చేసి కాసు కల్యాణ్, కోలగట్ల ఉమయ్య, కాసు మోహన్, మరో బాలుడ్ని పిలిపించుకుని విద్యార్థులను చంపుతామని కత్తులతో భయభ్రాంతులకు గురిచేశారు. వారు కేకలు వేయడం, ప్రజలు రావడంతో నిందితులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కోడూరుపాడుకు చెందిన మోహన్, శ్రీనివాసులు, కల్యాణ్, ఉమయ్య, పెనుబర్తి గ్రామానికి చెందిన రాకేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాసులు, ఉమయ్యపై గతంలో కొట్లాట కేసులున్నాయి. వారి నుంచి మోటార్‌బైక్, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఇద్దరు బాలురను జువైనల్ హోమ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సైలు లక్ష్మణ్, సుధీర్ పాల్గొన్నారు.


