6 కేజీల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.660 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర ఏఎస్పీ దీక్ష నెల్లూరులోని తన కార్యాలయంలో వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావుతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం వైఎస్సార్ నగర్ తొమ్మిదో వీధిలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడులు చేశారు. గంజాయి విక్రేతలైన అదే ప్రాంతానికి చెందిన అరవ ఓంరేష్, సయ్యద్ లియాకత్ అలీ, నగరంలోని కపాడిపాళేనికి చెందిన ఊట్ల జాన్‌వెస్లీని అదుపులోకి తీసుకున్నారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.66 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించగా ఏఓబీ సరిహద్దు ప్రాంతాలనుంచి గంజాయిని తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్నట్లు వెల్లడించడంతో నిందితులను అరెస్ట్ చేశామని దీక్ష తెలిపారు. ఓంరేష్‌పై ఇప్పటికే రెండు కేసులున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్ జిలానీ, కానిస్టేబుళ్లు రాజకిశోర్, వెంకట్రావు, గురుమహేష్, నాగరాజు, శ్రీనివాసులను ఏఎస్పీ అభినందించారు.


