అంకితభావంతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): మానసిక, శారీరక ధృడత్వాన్ని, వృత్తినైపుణ్యాలను పెంపొందించుకుంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ అజిత వేజెండ్ల సాయుధ పోలీసులకు సూచించారు. జిల్లా సాయుధ బలగాల వార్షిక సమీకరణ (యాన్యువల్ మొబలైజేషన్) ముగింపు కార్యక్రమం బుధవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో జరిగింది. బ్యాండ్ పార్టీ వాయిద్యాల నడుమ సాగిన కవాతును వీక్షిస్తూ వారి నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ పోలీస్ శాఖలో ఏఆర్ సిబ్బంది పాత్ర విశిష్టమైందన్నారు. విధి నిర్వహణతోపాటు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ వార్షిక సమీకరణ కార్యక్రమంలో ఆయుధాల శిక్షణ, ఫైరింగ్ ప్రాక్టీస్, డ్రిల్, మాబ్ కంట్రోల్, ప్రవర్తన నియమాలు తదితరాలపై సిబ్బందికి తర్ఫీదునిచ్చామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


