అటవీ శాఖ వాహనం ఢీకొని..
● ఆర్టీసీ కండక్టర్ మృతి
● మహిళకు గాయాలు
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కళాశాలలో మోటార్‌బైక్‌ను ఆత్మకూరు అటవీ శాఖ వాహనం ఢీకొనడంతో యేసుపోగు సుదర్శన్ (57) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. ఎంఎస్‌ఎంఈ పార్కు సమీపంలో నగరవనం పనులను పరిశీలించేందుకు అటవీ శాఖ సిబ్బంది జీపులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయగిరికి చెందిన ఆర్టీసీ కండక్టర్ సుదర్శన్ ఆత్మకూరుకు బైక్‌పై వస్తున్నాడు. దారిలో మర్రిపాడు మండలం శెట్టిసముద్రం గ్రామానికి చెందిన జయమ్మ లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కింది. ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఫారెస్ట్ సిబ్బంది జీపు కుడివైపునకు తిప్పుకొని రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న సుదర్శన్ బైక్‌ను ఢీకొట్టింది. అతను అపస్మారక స్థితికి చేరుకోగా, జయమ్మకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుదర్శన్ మృతిచెందాడు. జయమ్మ చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ప్రభుత్వ తీరు దారుణం
సైదాపురం: మండలంలోని సైదాపురం – డేగపూడి వరకు దారుణంగా ఉన్న రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని చెప్పడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. ఆదివారం కలిచేడులో ర్యాలీ చేశారు. గుంతల్లో మట్టి పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి, సర్వేపల్లి రహదారులు దారుణంగా ఉన్నాయని సత్వరమే అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బస్సులో ఎక్కి రహదారుల స్థితిగతులపై ప్రయాణికులతో మాట్లాడారు. నేతలు జిలానీఖాన్, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


