పెన్నానదిలో దూకిన వివాహిత
● రక్షించిన స్థానికులు, పోలీసులు
నెల్లూరు(క్రైమ్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత పెన్నానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా పోలీసులు స్థానికుల సహాయంతో రక్షించారు. పోలీసుల కథనం మేరకు.. జెండావీధి ప్రాంతానికి చెందిన షేక్ అజ్మతున్నీసా, ఖాజా మొహిద్దీన్ దంపతులకు కుమారుడున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అజ్మతున్నీసా ఆదివారం సాయంత్రం పెన్నా బ్యారేజ్ సమీపంలో నదిలో దూకింది. రథసప్తమి సందర్భంగా రంగనాయకుల స్వామి దేవస్థానం సమీపంలో విధులు నిర్వహిస్తున్న సంతపేట పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. ఎస్సై బాలకృష్ణ తన సిబ్బంది, స్థానికుల సహాయంతో నదిలోకి వెళ్లి వివాహితను రక్షించి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. సకాలంలో స్పందించిన పోలీసు అధికారులకు వివాహిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


