కత్తులతో దుండగుల హల్‌చల్
● భయాందోళనలో గూడూరు ప్రజలు
చిల్లకూరు: గూడూరు పట్టణంలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఏడాదిన్నరగా పట్టణంలో గంజాయి విక్రయాలు, చోరీలు, హత్యలు ఇలా ఒకటి తరువాత ఒకటి చోటుచేసుకుంటుండడంతో పట్టణ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున పట్టణంలోని తూర్పువీధి ప్రాంతంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో హల్‌చల్ చేశారు. టూల్‌కిట్‌ను చేతిలో పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూడు నివాసాల్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించారు. ఓ ఇంట్లో సుమారు 10 సవర్ల బంగారు వస్తువులు, రెండు కిలోల వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు పోలీసులు, ఇటు బాధితులు వివరాలు వెల్లడించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. కత్తులతో దుండగులు హల్‌చల్ చేసిన సీసీ టీవీ ఫుటేజీ వైరల్ కావడంతో గూడూరు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు గూడూరుపై ప్రత్యేక నిఘా ఉంచాలని నగర వాసులు కోరుతున్నారు.


