ఖాకీల మాటునే కోడి పందేలు! | - | Sakshi
Sakshi News home page

ఖాకీల మాటునే కోడి పందేలు!

Jan 25 2026 6:54 AM | Updated on Jan 25 2026 6:54 AM

ఖాకీల

ఖాకీల మాటునే కోడి పందేలు!

కోవూరు: పోలీస్‌ యంత్రాంగంలో నిఘా పటిష్టత కొరవడిందా?. అధికార పార్టీ ఒత్తిళ్లతో, అవినీతి ముడుపుల మత్తులో అసాంఘిక కార్యకలాపాలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారా?. విడవలూరు తీర ప్రాంతంలో ప్రతీ వారాంతంలో జరుగుతున్న కోడిపందేలు పోలీస్‌ శాఖ నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల బైక్‌లు, పదుల సంఖ్యలో కార్లు, ఆటోలు, వేల మందితో జాతరను తలపించేలా జరుగుతుంటే పోలీసులకు తెలియకుండా సాగుతుందంటే నమ్మశక్యంగా అనిపించడంలేదు. విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం కాలువ వద్ద రెగ్యులర్‌గా పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయం పోలీసుల కు తెలిసినా ఎప్పుడూ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలా లు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ కోడిపందేలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతం శనివారం కావడంతో భారీ ఎత్తున నెల్లూరు, కోవూరు, కొడవలూరు, విడవలూ రు, అల్లూరు, ఇందుకూరుపేట తదితర చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందల మంది కార్లు, బైక్‌ల్లో పందెం రాయుళ్లు రావడంతో తిరునాళ్ల వాతావరణం మాదిరిగా ఉంది. జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులకు అందిన సమాచారంతో ఎట్టకేలకు పోలీసులు కోడిపందేల స్థావరానికి చేరుకుని 54 మందిని అదుపులోకి తీసుకున్నామని, రూ.6.24 లక్షల నగదు, తొమ్మిది కార్లు, రెండు ఆటోలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని ప్రెస్‌మీట్‌లు పెట్టి గొప్పలు చెప్పుకున్నారు. కానీ అసలు ప్రశ్న ఇది కాదు. వందల బైక్‌లు, వందల మంది జనం, పదుల సంఖ్యలో కార్లు కళ్ల ముందు కనిపిస్తుంటే.. మొక్కుబడి అరెస్ట్‌లు, నగదు, బైక్‌లు, కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం చూస్తే హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఈ కోడి పందేల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? కోట్ల రూపాయల్లో జరిగే ఈ దందాను నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరు? వాళ్లను టచ్‌ చేసే ధైర్యం పోలీసులకు లేదా? లేక వాళ్ల పేర్లు బయట పడితే ఖాకీల నిజస్వరూపం బయటకు వస్తుందనే భయమా?.. అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం కొరవడిందంటే.. దీని వెనుక అధికార పార్టీ పెద్దలతోపాటు పోలీస్‌ పెద్ద పాత్ర ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు ప్రతీ వారం జరుగుతున్న ఈ కోడిపందేలపై ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదంటే.. ఇప్పటి వరకూ ఖాకీలు నిద్రపోతున్నారా? లేక అవినీతి మత్తులో జోగుతున్నారా? అనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊటుకూరు పెద్దపాళెం కాలువ వద్ద జరుగుతున్న కోడిపందేలు పోలీస్‌ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది.

54 మంది కోడి పందెం రాయుళ్ల అరెస్ట్‌

రూ.6.24 లక్షల నగదు, 9 కార్లు, రెండు ఆటోలు,

రెండు బైక్‌లు, 14 కోడి పుంజులు స్వాధీనం సీఐ సురేంద్రబాబు

విడవలూరు తీరం అడ్డాగా

ప్రతి వారాంతంలో భారీ ఎత్తున నిర్వహణ

కిక్కిరిసినట్లు తరలివచ్చిన జనం

వందల బైక్‌లు, పదుల సంఖ్యలో కార్లల్లో రాక

పోలీసులకు తెలియకుండానే

ఈ స్థాయిలో సమీకరణ జరుగుతుందా?

ముడుపుల మత్తులో కళ్లుమూసుకున్నారనే ఆరోపణలు

పోలీస్‌ బాస్‌కు తెలియడంతో

విధిలేని పరిస్థితుల్లో దాడులు

మొక్కుబడిగా 54 మంది అరెస్ట్‌, రూ.6.25 లక్షల నగదు, 9 కార్లు, రెండు బైక్‌లు, రెండు ఆటోలు

స్వాధీనం

కొడవలూరు: విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం కాలువ వద్ద జరుగుతున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు శనివారం దాడులు చేసినట్లు కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పెద్దపాళెం కాలువ వద్ద భారీ స్ధాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు.. ఆరుగురు ఎస్సైలు, 15 మంది కానిస్టేబుళ్లతో తాను స్వయంగా దాడి చేశామని తెలిపారు. ఈ దాడిలో 54 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 14 కోడి పుంజులు, రెండు ఆటోలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకొన్న పందెం రాయుళ్లతోపాటు స్వాధీనం చేసుకొన్న నగదు, వాహనాలు, కోడి పుంజులను కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్‌ కోటిరెడ్డి పాల్గొన్నారు.

ఖాకీల మాటునే కోడి పందేలు!1
1/1

ఖాకీల మాటునే కోడి పందేలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement