రిపబ్లిక్ డే రిహార్సల్స్ పరిశీలన
నెల్లూరు(క్రైమ్): నగరంలోని పోలీస్ కవాతు మైదానం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అందంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో శనివారం సిబ్బంది నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కవాతు రిహార్సల్స్‌ను ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. గౌరవ వందన సమర్పణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరినీ డీఎఫ్‌ఎండీ ద్వారా తనిఖీ చేసి కవాతు మైదానంలోకి అనుమతించాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్, ఏఆర్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐలు హరిబాబు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే రిహార్సల్స్ పరిశీలన


