అంతర్ జిల్లాల బైక్ దొంగ అరెస్ట్
● రూ.8.50 లక్షల విలువ చేసే 17 బైక్‌ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): బైక్ చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్ జిల్లాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో నగర ఏఎస్పీ దీక్ష, ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావుతో కలిసి నిందితుడి వివరాలను వెల్లడించారు. ఇటీవల నెల్లూరులో బైక్ దొంగతనాలు అధికమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు బైక్ దొంగలపై నిఘా పెట్టారు. ఆయన శనివారం తల్పగిరి కాలనీ వద్ద తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సిరసనంబేడు గ్రామానికి చెందిన పాతనేరస్తుడు కల్లూరు శ్రావణ్‌కుమార్ అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, చిన్నబజారు పోలీస్‌స్టేషన్ పరిధిలో 5, దర్గామిట్ట పరిధిలో 4, సంతపేట పరిధిలో ఒకటి, బాలాజీనగర్ పరిధిలో ఒకటి, తిరుపతి జిల్లా నాయుడుపేట పరిధిలో ఒకటి, తడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బక బైక్‌ను దొంగలించినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడి వద్ద నుంచి 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అతనిపై తిరుపతి జిల్లాలో సుమారు 20కుపైగా దొంగతనం కేసులున్నాయని, జైలుకు వెళ్లివచ్చినా మార్పు రాలేదని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రాబట్టేందుకు కృషి చేసిన ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై సాయి కల్యాణ్, హెడ్ కానిస్టేబుల్ జిలానీ, కానిస్టేబుల్స్ రాజకిశోర్, శ్రీను, నాగరాజు, వెంకటరామ్, బాలకృష్ణ తదితరులను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


