పైసలిస్తేనే సేవలు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కొందరు సిబ్బంది డబ్బుల కోసం రోగులు, వారి బంధువులను పీడిస్తున్నారు. ఎవరికై నా ఆపరేషన్ చేసినా.. కాన్పులు చేసినా ఎఫ్‌ఎన్‌ఓలకు పండగే. రోగులకు మాత్రం బాధలు తప్పడం లేదు. ఉదాహరణకు ఓ మహిళకు కాన్పు చేయాలంటే గర్భిణికి సిజేరియన్ చేస్తే ఆమెను వార్డులోకి స్ట్రెచర్‌లోకి తరలించేందుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే చిన్న ఐఅండ్‌డీ, మేజర్ ఆపరేషన్లు చేసినా రోగుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. రోగి డిశ్చార్జి అయ్యే నాటికి కనీసం రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారముంది. వార్డుల్లో లంచాలను అరికట్టాల్సిన నర్సింగ్ సిబ్బంది తమకేమీ పట్టనట్టున్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన డాక్టర్లు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది.
రోజూ రూ.100 చొప్పున
ఇటీవల హరనాథపురానికి చెందిన స్థానిక రాజకీయ నేత ఓ పేద రోగిని వైద్యం కోసం పెద్దాస్పత్రిలో చేర్పించాడు. అతను రోజూ వెళ్లి రోగితోపాటు సహాయకుడి తిండి, ఇతర ఖర్చుల కోసం రూ.500 ఇచ్చి వెళ్లేవాడు. అది చూసిన ఎఫ్‌ఎన్‌ఓలు వార్డును శుభ్రం చేసినందుకు, రోగిని వీల్‌చైర్‌లో పరీక్షలకు తీసుకెళ్లినందుకు అంటూ రోజూ రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. విషయం తెలిసిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు లంచాలు వసూలు చేసిన ఎఫ్‌ఎన్‌ఓలను పిలిచి మందలించి తీసుకున్న డబ్బులు వెనక్కు ఇప్పించారు.
అల్లాడిపోతూ..
850 పడకల పెద్దాస్పత్రిలో రోజుకి 1,200 నుంచి 1,400 మంది ఓపీ రోగులు వైద్యం కోసం వస్తున్నారు. 500 మంది వరకు అడ్మిషన్‌లో ఉంటున్నారు. అడ్మిట్ అయిన వారి నుంచే కాకుండా అవుట్ పేషెంట్లను వీల్‌చైర్‌లో పట్టినందుకో.. స్ట్రెచర్‌లో దించినందుకో డబ్బులు వసూలు చేస్తున్నా కట్టడి చేసేవారు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. లంచాల దెబ్బకు పేద రోగులు అల్లాడిపోతున్నారు.
ఇదీ పెద్దాస్పత్రిలో పరిస్థితి
డబ్బులివ్వకపోతే బెదిరింపులు
ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓల చేతివాటం
కాన్పుల వార్డులో రూ.1,000ల డిమాండ్
విచారించి చర్యలు తీసుకుంటా
డబ్బులు వసూలుపై నాకు ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. అయినా విచారించి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అంతేకాకుండా అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి హెచ్చరికలు చేసి నగదు తీసుకోకుండా చర్యలు చేపడతా.
– డాక్టర్ కొండేటి మాధవి,
సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రి
ధర్మాస్పత్రా? లేక పీడించే ఆస్పత్రా?
మేము నిరుపేదలం. నా భర్త అనారోగ్యానికి గురై అసలే టెన్షన్‌లో ఉన్నాం. ఈ సమయంలో ఎఫ్‌ఎన్‌ఓలు డబ్బుల కోసం పీడిస్తున్నారు. ఇది మరింత బాధగా ఉంది. డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలి. ధర్మాస్పత్రా లేదా పీడించే ఆస్పత్రా అర్థం కావడం లేదు.
– రాజమ్మ, కొండాయపాళెం
పైసలిస్తేనే సేవలు
పైసలిస్తేనే సేవలు
పైసలిస్తేనే సేవలు


