జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
నెల్లూరు(టౌన్): అండర్ – 19 స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి బాలుర బీచ్ వాలీబాల్ పోటీలకు జిల్లాలోని కావలి జేబీ జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థి బాలాజీ, ముత్తుకూరులోని అదానీ జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థి వి.ఆనంద్ కుమార్ ఎంపికయ్యారు. గతనెల 19 నుంచి 20వ తేదీ వరకు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా అండర్ 19 స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కావలిలోని జేబీ జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థి కె.కావ్య ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు పల్నాడు జిల్లాలోని వినుకొండలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. వీటిల్లో కావ్య అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బాలిక త్వరలో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటుంది. విద్యార్థులను శుక్రవారం నెల్లూరులోని కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీవీఈఓ బీవీ కృష్ణారెడ్డి, ఆర్‌ఐఓ వరప్రసాదరావు అభినందించారు. కార్యక్రమంలో అండర్ – 19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ పాటూరు వేణుగోపాల్‌రెడ్డి, కబడ్డీ కోచ్ కోటయ్య, ఫిజికల్ డైరెక్టర్ సురేష్ పాల్గొన్నారు.


