పరీక్ష రాసొచ్చాడు.. అంతలోనే..
● బాలుడ్ని ఢీకొన్న కారు
● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
సోమశిల: నవోదయ పరీక్ష రాయించి.. తమ కుమారుడ్ని ఉన్నత స్థానానికి చేర్చాలని ఆ తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. వీరు ఒకటి తలవగా, విధి మరొకటి తలచింది. పరీక్ష రాసి ఇంట్లో సందడిగా గడిపి.. ఆపై పొలాల్లో వరినాట్లు జరుగుతుండటంతో అక్కడికెళ్లి రోడ్డు పక్కన ఉండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని చాపురాళ్లపల్లికి చెందిన సన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సుప్రజ దంపతుల ద్వితీయ కుమారుడు ఆనంద్‌రెడ్డి (11) కలువాయిలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. నవోదయ పరీక్ష నేపథ్యంలో బాలుడ్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చి పరీక్ష రాయించారు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. హైవే పక్కన తమ పొలాల్లో వరినాట్లు జరుగుతుండటంతో అక్కడికెళ్లి రోడ్డు పక్కన ఉండగా, చుంచులూరు వైపు నుంచి అతివేగంతో వస్తున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆత్మకూరు వైద్యశాలకు తరలించేందుకు యత్నించగా మార్గమధ్యలోనే మృతి చెందారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. కాగా బాలుడ్ని ఢీకొన్న వాహనానికి తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని, దీన్ని రాపూరు టోల్‌గేట్ వద్ద గుర్తించామని చెప్పారు.
పరీక్ష రాసొచ్చాడు.. అంతలోనే..


