అవే చివరి గోరుముద్దలు..
● ఎంతో ఆనందంతో కుమార్తెకు
భోజనం తినిపించి..
● జాగ్రత్తలు చెప్పి తిరుగుపయనం
● అంతలోనే ఇన్నోవా ఢీకొని
తల్లిదండ్రుల మృతి
ఆత్మకూరు: విధి పగబట్టి.. దంపతులను కబళించింది. కుమార్తెకు గోరుముద్దలు తినిపించి.. తిరుగుపయనమైన పది నిమిషాలకే వీరిని ఇన్నోవా పొట్టనబెట్టుకుంది. వివరాలు.. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. ఆయన సన్నకారు రైతు కాగా.. గత ప్రభుత్వ హయాంలో వలంటీర్‌గా ఆమె పనిచేశారు. పెద్ద కుమార్తె మనస్విని నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్.. చిన్న కుమార్తె తేజస్విని ఆత్మకూరులోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ తరుణంలో వీరు గురుకుల పాఠశాలకు ప్రతి ఆదివారం వెళ్లి తేజస్విని యోగక్షేమాలను ఆరాతీసి క్యారియల్‌లో తీసుకొచ్చిన భోజనాన్ని తినిపించి వచ్చేవారు. ఈ తరుణంలో ఇలానే వెళ్లి కుమార్తెను కలిసి.. తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బద్వేల్ నుంచి నెల్లూరుకు రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఇన్నోవా వీరి బైక్‌ను ఢీకొంది. ఆపై బైక్‌తో సహా కారు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్సై జిలానీ ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
విషాదఛాయలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు.. ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. పది నిమిషాల క్రితమే తనను పలకరించి భోజనం పెట్టి ఇంటికెళ్తున్న తల్లిదండ్రులు మరణించారనే విషయాన్ని తెలుసుకున్న తేజస్విని, ఉపాధ్యాయులతో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతురాలి తల్లిదండ్రులు, సోదరి, బంధువుల రోదనలతో విషాద వాతారణం నెలకొంది. కాగా ఇన్నోవా డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులకు కొందరు తెలియజేశారు. కేసును సీఐ దర్యాప్తు చేస్తున్నారు.


