పర్యావరణ మనుగడకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కీలకం
నెల్లూరు(అర్బన్): తీర ప్రాంత మనుగడకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కీలకమని ఫారెస్ట్స్ కన్జర్వేటర్, గుంటూరు ఐకేవీ రాజు పేర్కొన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పరిరక్షణపై వివిధ తీర ప్రాంత జిల్లాల అటవీ శాఖ అధికారులు, మత్స్య, మైరెన్ శాఖలు, గ్రీన్ టీ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ప్రాంతీయ వర్క్‌షాపును నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సముద్రంలోని నాచును తిని, పగడపు దిబ్బలను కదిలించి చేపలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా తాబేళ్లు ఉపయోగపడతాయని వివరించారు. ఈ కారణంగా మత్స్య సంపద పెరిగి తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు ఉపాధి లభిస్తోందని వివరించారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒడ్డుకొచ్చి గోతులు చేసి గుడ్లు పెడుతాయని.. పౌర్ణమి, అమావాస్య రాత్రుల్లో మెరిసే వెలుగులను చూస్తూ తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్తాయని తెలిపారు. ఒక్కో తాబేలు 60 నుంచి 120 వరకు గుడ్లు పెడుతాయని, వీటిని కాపాడాలని కోరారు. తమిళనాడుకు చెందిన జాలర్లు 500 హెచ్‌పీ మోటార్లు కలిగిన హైస్పీడ్ ట్రాలీ బోట్లతో రాష్ట్రంలో వేట సాగిస్తున్నారని, దీని వల్ల మన సంప్రదాయ మత్స్యకారుల వలలు తెగిపోవడమే కాకుండా తాబేళ్లు మృతి చెందుతున్నాయని చెప్పారు. సముద్రంలో ఎనిమిది కిలోమీటర్ల మేర వెళ్లి వేట సాగించాల్సి ఉన్నా, రెండు కిలోమీటర్ల పరిధిలోనే జరుపుతున్నారని తెలిపారు. నిబంధనలు అతిక్రమంచే వారిపై మత్స్య, మైరెన్, అటవీ శాఖలు చర్యలు చేపడతాయని వెల్లడించారు. సముద్ర తాబేళ్లు, ఇతర జంతువుల నమూనా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా, మత్స్యశాఖ జేడీ శాంతి. గ్రీన్ ట్రీ చైర్‌పర్సన్ సుప్రజాధరణి, మత్స్యకార సొసైటీ చైర్మన్ కొండూరు పోలిశెట్టి తదితరులు పాల్గొన్నారు.


