భావితరాలకు వందేమాతర స్ఫూర్తి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: భావితరాలకు వందేమాతర స్ఫూర్తిని అందిద్దామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, సిబ్బంది గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు మాట్లాడుతూ వందేమాతర గేయం యావత్ భారతజాతిని సంఘటితం చేసి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. సమాజంలో నేటికీ ఈ వందేమాతర స్ఫూర్తి అవసరమన్నారు. మతాలు, భాషలు వేరైనా మొదట మనమంతా భారతీయులమనే విషయాన్ని గ్రహించి, అందరూ ఐకమత్యంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి తుమ్మా విజయకుమార్, మత్స్యశాఖ జేడీ శాంతి, ఐఅండ్‌పీఆర్ డీడీ వేణుగోపాల్‌రెడ్డి, డీఈ శివశంకర్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.


