మద్యం మత్తులో.. ఇష్టానుసారంగా..
● వాహనాలు నడుపుతున్న మందుబాబులు
● డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్న
ట్రాఫిక్ పోలీసులు
● ఈ ఏడాదిలో 1,415 కేసుల నమోదు
నెల్లూరు(క్రైమ్): మద్యం మహమ్మారి జీవితాలను చిత్తు చేస్తోంది. అనేకమంది మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మందుబాబులు ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. శరీర అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం మద్యం తాగుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీరి కారణంగా శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతున్నాయి.
దృష్టి సారించి..
రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల కట్టడిపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. నెల్లూరు నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. శివారు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, జాతీయ రహదారి ప్రవేశ ప్రాంతాలు తదితరాల వద్ద వాహన తనిఖీలు విస్తృతం చేశారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. న్యాయస్థానం రూ.10 వేల జరిమానా విధిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నగర సౌత్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 936, నార్త్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 479 మొత్తంగా 1,415 కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. భారీ జరిమానాతో మందుబాబులు బెంబేలెత్తుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గృహాలకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం రాత్రిపూట మాత్రమే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై పగటిపూట సైతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారాంతపు రోజులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.


