హాకీ క్రీడాకారుల్లో నూతనోత్సాహం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): హాకీ క్రీడాకారుల్లో నూతనోత్సాహం నెలకొంది. హాకీ ఇండియా ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి నెల్లూరు నుంచి ఆడి వివిధ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న సీనియర్ క్రీడాకారులు, హాకీ పెద్దలు, చిన్నారులు విచ్చేశారు. తొలుత కేవీఆర్ పెట్రోల్ బంకు నుంచి స్టేడియం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం పోటీలను నిర్వహించారు. వరంగల్ ఆర్‌ఏసీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి వచ్చిన పూర్వ క్రీడాకారుడు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, సిరి డెవలపర్స్ అధినేత డాక్టర్ బాబు అగస్ట్రిన్, డీఎస్‌డీఓ ఎం.పాండురంగారావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు, సీనియర్ క్రీడాకారుడు పి.థామస్ పీటర్ హాకీ విశిష్టతను వివరించారు. అనంతరం మొదటి స్థానంలో నిలిచిన పురుషుల స్టేడియం జట్టు, రెండో స్థానంలో నిలిచిన మిక్సిడ్ జట్టుకు, మహిళా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన మాదరాజు గూడూరు జట్టు, రెండో స్థానంలో నిలిచిన శ్రీకొలను జట్టుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేశ్వరరెడ్డి, గురుప్రసాద్, సీనియర్ క్రీడాకారులు కోటేశ్వరమ్మ, కమల, శేషయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు వాసు, కోచ్ చందు, సీనియర్ క్రీడాకారులు డానియేల్ దివాకర్, సురే ష్, నాగేంద్ర, పద్మజ, సుమతి, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి పి.జగన్‌మోహన్, నెల్లూరు జిల్లా నుంచి హాకీ ఆడి వివిధ జిల్లాల్లో స్థిరపడిన సుమారు 170 మందికి పైగా సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


