కూటమికి కనువిప్పు కలిగేలా ఉద్యమం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కోటి సంతకాల ఉద్యమం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో శుక్రవారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నెల్లూరు చింతారెడ్డిపాళెం 13వ డివిజన్ మెడికవర్ సెంటర్‌లో నిర్వహించారు. దీనికి పర్వతరెడ్డి, నగర నియోజకవర్గ పరిశీలకుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి విచ్చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నాడు – నేడు కింద పాఠశాలల అభివృద్ధి పనులను నిలిపివేశారన్నారు. మెడికల్ కళాశాలలు చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తూ పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారని చెప్పారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణకు అత్యధిక మెజార్టీ ఇస్తే నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నేను చెప్పిందే జరగాలన్న ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి చెప్పిన వారికే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నారన్నారు. ఇలాంటి పోకడలతో ప్రజలు ఎంతో విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నానన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సెక్రటరీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హంజా హుస్సేని, అధికార ప్రతినిధి రవూఫ్, పార్టీ 14, 3, 53, డివిజన్ ఇన్‌చార్జిలు గిరిరెడ్డి, నారాయణరెడ్డి, వెంగళ్‌రెడ్డి, యువజన విభాగం నగరాధ్యక్షుడు యస్దాని, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


