సమస్యల పరిష్కారానికి లంచాలివ్వాలా?
● ఆర్ అండ్ బీ ఉద్యోగుల నిరసన
నెల్లూరు (అర్బన్): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు అన్నారు. ఆర్ అండ్ బీ శాఖలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయాలని, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశాఖ ఉద్యోగులు నగరంలోని సర్కిల్ కార్యాలయంలో నల్ల రిబ్బన్లు ధరించి చేస్తున్న నిరసన మంగళవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. శరత్‌బాబు మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం పదవీ విరమణ పొందిన ఎస్‌ఈతోపాటు మరో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారుల కారణంగా ఆర్ అండ్ బీ శాఖ భ్రష్టు పట్టిందన్నారు. ఇకనైనా 25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వర్క్ ఇన్‌స్పెక్టర్ పదోన్నతులు వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు ఆటో మేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం ఇవ్వాలని, టెక్నికల్ ఉద్యోగులకు బీపీఓల నుంచి ట్రేసర్‌లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఏ–5 సీటుకు క్లర్క్‌ను నియమించి దొంగిలించబడిన ఫైల్స్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు ఎస్‌ఎం రత్నం, శంకర్‌బాబు, షబ్బీర్ అహ్మద్, సురేష్‌బాబు, రాము తదితరులు పాల్గొన్నారు.


