అధికార దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

అధికార దౌర్జన్యం

Nov 5 2025 7:49 AM | Updated on Nov 5 2025 7:49 AM

అధికా

అధికార దౌర్జన్యం

వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు రఫీపై వేధింపులు

ఆయన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను

మూయించిన వైనం

రెండేళ్లుగా నిర్వహణలో ఉన్న

కాంప్లెక్స్‌

అనుమతులు లేవంటూ

తాళాలు వేసిన అధికారులు

రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు

కందుకూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై అధికార పార్టీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు షేక్‌ రఫీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు నేతలు పూనుకున్నారు. ఆయనకు పోస్టాఫీస్‌ సెంటర్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. ముందస్తు నోటీసుల్లేకుండా మంగళవారం భారీగా పోలీసులను మోహరించి మున్సిపల్‌ అధికారుల చేత తాళాలు వేయించారు. అడ్డుకునేందుకు రఫీ, నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వేధింపుల్లో భాగంగానే..

పోస్టాఫీస్‌ సెంటర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థకు బిల్డింగ్‌ ఉంది. దీనిని అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు రెండేళ్ల క్రితం టెండర్లు ఆహ్వానించింది. స్వాతి కన్‌స్ట్రక్షన్‌ అనే సంస్థ పేరుపై సూరం వేణుగోపాల్‌రెడ్డి టెండర్‌ దక్కించుకున్నాడు. అతడి నుంచి బాధ్యతను రఫీ చేపట్టారు. బిల్డింగ్‌ని షాపింగ్‌ కాంప్లెక్స్‌లా మార్చి దుకాణాలను అద్దెకిచ్చారు. ప్రతినెలా బీఎస్‌ఎన్‌ఎల్‌కు అద్దె చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రఫీపై అధికార పార్టీ నేతల రాజకీయ వేధింపులు ప్రారంభమయ్యాయి. భవనానికి మున్సిపాలిటీ అనుమతుల్లేవని, టెండర్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ అటు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఇటు మున్సిపల్‌ అధికారుల నుంచి నోటీసులు ఇప్పించడం ప్రారంభించారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అగ్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీనిపై కాంట్రాక్టు దక్కించుకున్న వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే భవవానికి అనుమతుల్లేవంటూ విద్యుత్‌ శాఖ అధికారులు సరఫరాను నిలిపివేశారు. తాజాగా మంగళవారం మున్సిపల్‌ అధికారులు పోలీస్‌ బందోబస్తుతో షాపింగ్‌ కాంప్లెక్స్‌కు వద్దకు చేరుకుని షాపుల యజమానులను ఖాళీ చేయాలని ఆదేశించారు. తాళాలు వేస్తున్నామంటూ అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు.

రాజకీయ కక్షతోనే..

ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా ఒక్కసారిగా వచ్చి షాపింగ్‌ కాంప్లెక్స్‌ని మూసేస్తుండటంతో రఫీతోపాటు, వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం కరువైంది. భవనానికి అనుమతులు లేనందునే తాళాలు వేస్తున్నామని, ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌కు నోటీసులు ఇచ్చామంటూ మున్సిపల్‌ అధికారుల చెప్పుకొచ్చారు. మీకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సమాధానం చెప్పారు. దీంతో అధికారులు, నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అద్దె చెల్లిస్తున్నా..

రఫీ మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే అధికార పార్టీ నేతలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు ఏర్పాటు చేసుకున్న వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతి అధికారిపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.

పాపం చిరు వ్యాపారులు

కాంప్లెక్స్‌లో ప్రస్తుతం పది వరకు షాపులున్నాయి. సెల్‌ఫోన్‌, దుస్తులు, ఫ్యాన్సీ వస్తువులు, టీ, కూల్‌డ్రింక్స్‌ దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ఖాళీ చేయించడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. యజమానులంతా దాదాపు రెండు, మూడు గంటలపాటు శ్రమించి సామగ్రిని ఆటోల్లో వేసుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇంటీరియర్‌కు, సామగ్రి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో పడ్డామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అధికార దౌర్జన్యం 1
1/2

అధికార దౌర్జన్యం

అధికార దౌర్జన్యం 2
2/2

అధికార దౌర్జన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement