మోంథా.. నష్టాలు నిండా
నెల్లూరు(అర్బన్): మోంథా తుఫాన్.. జిల్లాకు నష్టాన్ని మిగిల్చింది. కాకినాడ – మచిలీపట్నం మధ్య నరసాపురం వద్ద తీరాన్ని మంగళవారం దాటింది. ఏకథాటిగా 30 గంటలు వర్షం కురవడంతో జిల్లాలోని చెరువులు నిండాయి, వాగులు, వంకలు పొంగాయి. రోడ్లు, రహదారులపై వరదనీరు చేరి రాకపోకలు స్తంభించాయి. 21 మండలాల్లో సుమారు 4500 మంది తుఫాన్ ప్రభావానికి గురయ్యారు. జిల్లాలో రూ.44.44 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి స్థాయి సర్వే చేస్తున్నారు. పొలాల్లో వరద నీరు పూర్తిగా తొలగిపోయాక ఈ నష్టం మరింత పెరగొచ్చని తెలుస్తోంది.
నష్టం ఇలా..
● భారీ వర్షాలకు 1282.63 హెక్టార్లలో వరిపైరు దెబ్బతింది. హెక్టార్‌కు రూ.25 వేల చొప్పున రూ.3,20,65,000.. సజ్జ నాలుగు హెక్టార్లలో దెబ్బతినగా, హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున రూ.60 వేలు.. వేరుశనగ 11.4 హెక్టార్లలో హెక్టార్‌కు రూ.25 వేల చొప్పున రూ 2.85 లక్షలు.. మొక్క జొన్న 1.7 హెక్టార్లలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున రూ.25 వేలు.. ఇలా మొత్తం నష్టం రూ.3.24 కోట్లకుపైగా ఉంటుంది.
● మూడు కచ్చా గృహాలకు రూ.20 వేల చొప్పున నష్టం వాటిల్లింది.
● ఆరు పెద్ద పశువులు, నాలుగు గొర్రెలు మృతి చెందగా, వీటి విలువ రూ.1.8 లక్షలుంటుంది.
● పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 22 గ్రామీణ రోడ్లు 96.2 కిలోమీటర్ల పరిధిలో గుంతలు ఏర్పడి దెబ్బతిన్నాయి. దీనికి గానూ రూ.57.71 లక్షల నష్టం వాటిల్లింది.
● 31 ఆర్ అండ్ బీ రోడ్లకు గుంతలు పడ్డాయి. బ్రీచెస్, సీడీ వర్క్స్, వరదనీరు ఓవర్ ఫ్లో కావడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల తొలగింపు.. ఇలా రూ.22.87 కోట్ల నష్టం సంభవించింది.
● నాలుగు పట్టణాల్లో 4.7 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. తాగునీటి పైప్‌లైన్, ఓపెన్ డ్రెయిన్ డ్యామేజీ.. ఇలా మున్సిపల్ శాఖకు రూ.75.6 లక్షల నష్టం వాటిల్లింది.
ఇద్దరి మృతి
మనుబోలు మండలం గొట్లపాళేనికి చెందిన జయమ్మ.. గేదెల కోసం పొలాల్లోకి వెళ్లి మృతి చెందారు. మర్రిపాడు మండలం రామానాయుడుపల్లెలో కోనంకి రామ్‌చరణ్ (13) బొగ్గేరులో దిగి మూడు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు. వీరి కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు.
విద్యుత్ శాఖకు..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో కురిసిన వర్షా లు, ఈదురుగాలులకు విద్యుత్ సంస్థకు రూ.53 లక్షల మేర నష్టం సంభవించిందని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది 33 కేవీ సబ్‌స్టేషన్లు ప్రభావితమయ్యాయని చెప్పారు. వీటి పరిధిలో 33 కేవీ లైన్లు 18.. 11 కేవీ లైన్లు 53.. 76 విద్యుత్ స్తంభాలు.. 19 కిలోమీటర్ల మేర ఎల్టీ లైన్లు.. 248 ట్రాన్స్‌ఫార్మర్లు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయని పేర్కొన్నారు. 90 శాతం మేర మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించామన్నారు.
పంటలు, ఆస్తి నష్టం రూ.44.44 కోట్లుగా ప్రాథమిక అంచనా
పూర్తి స్థాయి సర్వే చేస్తున్న
అధికారులు
పునరావాస కేంద్రాల నుంచి
ఇళ్లకు చేరుకున్న ప్రజలు


