● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
మనుబోలు: పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే ప్రభుత్వ యత్నాలను సాగనీయబోమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనుబోలు బస్టాండ్ సెంటర్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కళాశాలల్లో ఏడు పూర్తవ్వగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వీటిని పూర్తి చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు వాటికి అనుసంధానంగా ఏర్పాటయ్యే సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించొచ్చని తెలిపారు. అయితే దీనికి భిన్నంగా కమీషన్లకు ఆశపడి మెడికల్ కశాళాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం దుర్మార్గమని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కోటి సంతకాల సేకరణను ప్రారంభించామని వివరించారు. వీటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ఎంపీపీ గుండాల వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యులు దువ్వూరు రాజేశ్వరమ్మ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, భాస్కర్‌గౌడ్, ముంగర రవీందర్‌రెడ్డి, గుంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


