ఉధృతంగా బీరాపేరు
ఆత్మకూరు: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏఎస్‌పేట మండలంలోని కొండమీదకొండూరుకు వెళ్లే దారిలో చప్టాపై బీరాపేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చేజర్ల మండలం దాచూరు నుంచి పెంచలకోనకు వెళ్లే మార్గంలో కొల్లపునాయుడుపల్లి వద్ద రోడ్డు గుంతలమయంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అనంతసాగరం మండలంలో 1500 ఎకరాల వరి పైరు పూర్తిగా నీటమునిగి.. వెన్నులు తేలుతున్నాయి. అగ్రహారం, గౌరవరం గ్రామాల పరిధిలో మిరప తోటల్లో నీరు నిలిచిందని రైతులు తెలిపారు. పడమటికంభంపాడులో సుమారు 40 ఎకరాల్లో వేరువనగ పైరు దెబ్బతినింది. కాగా పంట నష్ట పరిశీలన నిమిత్తం గ్రామాల్లో వ్యవసాయాధికారులు పర్యటిస్తున్నారు.


