మేకపాటితో ప్రసన్న మర్యాద పూర్వక భేటీ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నెల్లూరు డైకస్‌రోడ్డులోని మేకపాటి నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం జిల్లా, రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీలో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, ఏపీఎల్‌డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నాయకులు కలువ బాల శంకర్‌రెడ్డి, కోవూరు వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు బిరదవోలు రూప్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
పునరావాస కేంద్రంలో
చంటి బిడ్డల ఆకలి కేకలు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): మోంథా తుఫాన్ నేపథ్యంలో నగరంలోని 15, 53, 54 డివిజన్లకు చెందిన లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను బాలాజీనగర్, గాంధీ గిరిజనకాలనీ, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గాంధీగిరిజన కాలనీ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నెలల వయస్సు ఉన్న చంటి బిడ్డల నుంచి చిన్నారులు ఉన్నారు. వీరికి పాలు అందించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులతోపాటు ఆహారం, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా పునరావాస కేంద్రాలను సీపీఎం నగర అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, పలువురు నాయకులు వెళ్లి పరిశీలించడంతో తాము పడుతున్న ఇబ్బందులను బాధితులు వారికి చెప్పారు. దీంతో అప్పటికప్పుడు స్పందించిన నాయకులు చంటి బిడ్డలకు పాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
78 ఆర్టీసీ బస్సులు రద్దు
నెల్లూరు సిటీ: తుఫాన్ భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం జిల్లా నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు ప్రాంతాలకు వెళ్లే 25, జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు నడిచే 53 బస్సులు మొత్తం 78 బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. నెల్లూరు–పర్లకొండ మధ్య ఒకటి, నెల్లూరు–కోటితీర్థం మధ్య రెండు, నెల్లూరు–పామూరు మార్గంలో 20 బస్సులు, దగదర్తి–కామినేనిపాళెం మార్గంలో నెల్లూరు నుంచి మబ్బుగుంటపాళెం మధ్య రెండు బస్సులు, నెల్లూరు–సోమశిల మార్గంలో ఆరు బస్సులు రద్దుచేశారు. కందుకూరు– కావలి మార్గంలో 11 బస్సులు, ఇదే మార్గంలో చిమిడితిపాడు వద్ద కల్వర్టు వద్ద ప్రవాహం దృష్ట్యా మరో 11 బస్సులు నిలిపివేశారు.
32,650 క్యూసెక్కుల విడుదల
సోమశిల: జలాశయంలో మంగళవారానికి 39,432 క్యూసెక్కుల వరద వస్తుండగా పెన్నానదికి 32,650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 67.293 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
నెల్లూరు (అర్బన్): మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లాలో సగటున 105.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కందుకూరులో 177.8 మి.మీ., అత్యల్పంగా రాపూరులో 33.6 మి.మీ. వర్షం కురిసింది. కావలి 174.6, అల్లూరు 156.6, దగదర్తి 149.2, జలదంకి 145.8, విడవలూరు 140.8, కొడవలూరు 139.4, బోగోలు 134.6, ఉలవపాడు 123.6, వలేటివారి పాళెం 120.4, గుడ్లూరు 120.0, తోటపల్లిగూడూరు 116.2, కలిగిరి 113.4, కోవూరు 108.6, బుచ్చిరెడ్డిపాళెం 107.0, లింగసముద్రం 105.4, పొదలకూరు 104.2, నెల్లూరు అర్బన్ 101.2, వింజమూరు 100.6, ఉదయగిరి 100.4, కొండాపురం 99.8, సంగం 99.6, అనుమసముద్రంపేట 98.2, ఇందుకూరుపేట 98.2, చేజర్ల 93.4, మర్రిపాడు 93.4, నెల్లూరు రూరల్ 91.6, వరికుంటపాడు 84.8, వెంకటాచలం 83.2, ఆత్మకూరు 79.2, కలువాయి 76.2, ముత్తుకూరు 75.8, అనంతసాగరం 72.4, దుత్తలూరు 71.0, సీతారామపురం 69.8, సైదాపురం 69.4, మనుబోలు 65.6 మి.మీ. వర్షం కురిసింది.
మేకపాటితో ప్రసన్న మర్యాద పూర్వక భేటీ


