ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలి
వెంకటాచలం: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. వెంకటాచలంలోని కనుపూరు చెరువును మంగళవారం సాయంత్రం కాకాణి పరిశీలించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆయా గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కాకాణి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటాక మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప నివాసాల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని, చెట్ల కింద, కరెంట్ స్తంభాల కింద ఉండొద్దని తెలియజేశారు. అవసరమైన మందులు, నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలను తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజల అవసరాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఎవరికి ఏ అవసరం వచ్చినా, సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని, ఎవరికై నా ఇబ్బందులు వస్తే 8712603258 నంబర్‌కు కాల్ చేస్తే, తమ పార్టీ శ్రేణులు స్పందించి, సమస్య పరిష్కారానికి, సహాయక చర్యలకు కృషి చేస్తారని కాకాణి వివరించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నిర్మించిన భవనాలు తుఫాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండే వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ వసతులు కల్పించడంతో , ప్రస్తుతం ఆ స్కూళ్లు పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కలిగిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు సచివాలయ ఉద్యోగుల ద్వారా సమగ్రంగా సేవలు అందించే అవకాశం ఏర్పడిందని తెలియజేశారు. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, కనుపూరు సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మందల పెంచలయ్య, మందల మస్తానయ్య, ఏడుకొండలు, ఉప్పు అశోక్, తురకా హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఏ అవసరమొచ్చినా 87126 03258 నంబర్‌కు కాల్ చేయొచ్చు
వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పందించి సహాయక చర్యలు చేపడుతారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


