
వెంగమాంబ ఆలయాభివృద్ధికి చర్యలు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
దుత్తలూరు: నర్రవాడలోని వెంగమాంబ ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో కలిసి ఆయన వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దేవదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, శాశ్వత కట్టడాలు తదితర నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ఇంజినీర్లు, స్థపతులు వీటిని నిర్మాణాలకు రూ.10 కోట్ల అంచనా వేసినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ఆలయ పరిసరాల్లోని స్థలాలను సర్వే చేసి నివేదిక అందించాలన్నారు. కార్యక్రమంలో నేతలు కంభం విజయరామిరెడ్డి, చెంచలబాబు యాదవ్, దేవదాయ శాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ అజాద్, అసిస్టెంట్ కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.