
మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయొద్దు
● ఉదయగిరి సమన్వయకర్త
మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ఉదయగిరి: ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయొద్దు. అలా జరిగితే పేద రోగులకు వైద్యం అందదు’ అని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టించలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కరోనా వంటి విపత్తు ఎదుర్కొని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. నేటి ప్రభుత్వ పెద్దలు కాలేజీలను ప్రైవేటీకరించి ఆస్తులను తమ అనుచరులకు అప్పనంగా దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని విరమించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందన్నారు. ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించి, దానికి కూడా సవాలక్ష షరతులు పెట్టారన్నారు. పాత బకాయిలు, పీఆర్సీ విషయం మాట్లాడొద్దని చెప్పడం చూస్తే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. కార్యక్రమంలో పలు మండలాల కన్వీనర్లు రేవునూరి శ్రీనివాసరెడ్డి, కాటం రవీంద్రరెడ్డి, ఎం.తిరుపతినాయుడు, ఇస్కా మదన్, కొండా రాజగోపాల్‌రెడ్డి, చిమ్మిలి రవీంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మాగంటి సిద్ధయ్య, మల్లికార్జునరెడ్డి, ముడియాల మరళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.