
అమ్మకు కన్నీటి వీడ్కోలు
● గుండెపోటుతో మృతిచెందిన తల్లి
● అంత్యక్రియలు చేసిన కుమార్తె
సంగం: రాత్రి తల్లీకూతురు భోజనం చేసి నిద్రపోయారు. ఉదయానికి తల్లి మృతిచెందింది. తనను అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మ చనిపోవడంతో కుమార్తె కన్నీరుమున్నీరుగా రోదిస్తూ అంత్యక్రియలు చేసింది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రమైన సంగం నిమ్మతోపు సెంటర్‌కు చెందిన పెరుమాళ్ల గోపీ, ఆదిలక్ష్మి (45) దంపతులకు వెన్నెల, భార్గవి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కొన్నేళ్ల క్రితం కరోనాతో గోపీ మృతిచెందాడు. ఆదిలక్ష్మి కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చూసుకుంంది. రెండు సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె వెన్నెలకు వివాహం చేసింది. కొంతకాలం క్రితం గేదెలు కొనుగోలు చేసి పాలు పోస్తోంది. భార్గవి తల్లి వద్ద ఉంటూ 9వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి తల్లీకుమార్తె ఇంట్లో నిద్రపోయారు. బుధవారం ఉదయం భార్గవి ఆదిలక్ష్మిని నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని అక్క, బావ వినోద్‌కు చెప్పింది. బాలిక తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆదిలక్ష్మి గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.