
జిల్లా అంతటా భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాలకు తోడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జడివాన కురుస్తోంది. వారం రోజులుగా ముసురు వీడలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొర్లుతుండటంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం కసురుమీద ఉంది. ఎగసిపడుతున్న అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
నెల్లూరు (అర్బన్): వాయుగుండం ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే చెరువులు దాదాపుగా నిండాయి. మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో ప్రవహించే బొగ్గేరులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల పరిధిలో ఉండే పిల్లాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు , అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మనుబోలు కండలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం వద్ద ఉండే బీరాపేరుకు వరద పెరిగింది. సైదాపురం మండలంలోని వాగులు పొంగుతున్నాయి. అక్కడి కై వల్యానది వర్షపు నీటితో పోటెత్తుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నుంచి వెళ్లే మలిదేవి డ్రెయిన్, పైడేరుకు ప్రవాహం పెరిగింది. పలుచోట్ల చెరువులు కలుజులు పారుతున్నాయి. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతోంది.
సోమశిల–ఆత్మకూరు మధ్య
రాకపోకలు బంద్
అనంతసాగరం మండలంలోని కొమ్మలేరు, కేతామన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముత్తుకూరు వద్ద కొమ్మలేరు వాగుపై ఉన్న వంతెన స్వల్పంగా కుంగింది. రేవూరు వద్ద వంక, కమ్మవారిపల్లి వద్ద అలుగు పొంగి పొర్లుతున్న కారణంగా ఆత్మకూరు– సోమశిల– అనంతసాగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పెన్నానదికి పెరిగిన ప్రవాహం
పెన్నానదిలో సోమశిల నుంచి విడుదల చేసే వరద జలాలతోపాటు, పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని వాగుల నుంచి వచ్చే వరదతో కలిసి సుమారు 80 వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో ఏక్షణంలోనైనా పెన్నానదిలోకి లక్షల క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 30 గ్రామాల ప్రజలు ఏక్షణంలోనైనా వరద తమ గ్రామాలపైకి వస్తుందోనని వణికి పోతున్నారు. సంగం బ్యారేజీ వద్ద బుధవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటితోపాటు వర్షాల వల్ల తోడైన వరదనీరు కలిసి 70 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో సంగం బ్యారేజీ వద్ద ఉన్న 79 గేట్లను ఒక్కసారిగా అధికారులు ఎత్తేసి నీటిని నదిలోకి విడుదల చేశారు. ఫలితంగా పెన్నానది పరవళ్లు తొక్కుగా నెల్లూరు వైపు ప్రవాహం పరుగెడుతోంది. లోతట్టు ప్రాంతాలైన తూర్పు కంభంపాడు, అప్పారావుపాళెం, వీర్లగుడిపాడు, కోలగట్ల, నెల్లూరు నగరంలోని ఆర్టీసీ కాలని, శివగిరికాలనీ, జనార్దన్‌రెడ్డినగర్, రాజీవ్ గృహకల్ప, కొత్తూరులోని శ్రీలంకకాలని, మనుమసిద్దినగర్, జయలలిత నగర్ తదితర అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
2,500 ఎకరాల్లో నీటమునిగిన పంటలు
అనంతసాగరంలో 1500 ఎకరాలు, చేజర్ల మండలం కాకివాయిలో 100 ఎకరాల్లో వరి, కందుకూరు, కలువాయిలో కోతకొచ్చిన వరి పంట నీటమునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మిర్చి, కూరగాయలు తదితర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 2,500 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
వాయుగుండం ప్రభావంతో కొత్తకోడూరు, మైపాడు బీచ్‌తోపాటు రామతీర్థం, రామాయపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం సుమారు 6 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. తీరం వెంబడి అలలు ఎగసి పడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.
రామాయపట్నంలో తీరం కోత
కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు
పొంగుతున్న వాగులు, వంకలు
రాకపోకలకు అంతరాయం
చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు
ముందుకొచ్చిన సముద్రం
నేడూ విద్యా సంస్థలకు సెలవు
కృష్ణపట్నంలో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక
ముత్తుకూరు (పొదలకూరు) : అల్పపీడనం ద్రోణి నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో బుధవారం సాయంత్రం 3వ నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగుర వేశారు. జాలర్లు వేటకు వెళ్లరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మత్స్యకారులు, ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలి
నెల్లూరు (పొగతోట): బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు, ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలని మత్స్యశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉందని, మత్స్యకారులు తమ వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పెద్దబోట్లను కృష్ణపట్నం, జువ్వలదిన్నె హార్బర్లల్లో నిలుపుదల చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సాగర మిత్రలు, గ్రామ మత్స్యకారుల సహాయకులు, రెవెన్యూ, మైరెన్ పోలీసుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆక్వా రైతులు భారీ వర్షాలకు గుంతలో నీటి మట్టం పెరిగి కట్టలు తెగకుండా నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సాంద్రత ఉంటే చేపలు, రొయ్యల సంఖ్య తగ్గించాలన్నారు. వాతావరణం ప్రభావంగా ఆకలి మందగిస్తుందని అనుగుణంగా దాణా తగ్గించాలన్నారు. రొయ్యల చెరువులో డీఓ సమస్య రాకుండా ఏయిరేటర్లు వాడాలన్నారు.
రాపూరు: మండలంలోని పంగిలి గ్రామానికి వెళ్లే మార్గంలో కొండేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టితో డైవర్షన్ రోడ్డు నిర్మించారు. బుధవారం కొండేరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సిద్ధేశ్వరకోన, పెంచలకోనలోని జలపాతం వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అక్కడ సిబ్బందిని ఉంచినట్లు రేంజర్ మాల్యాద్రి తెలిపారు.
నేడూ పాఠశాలలు, కళాశాలలకు సెలవు
నెల్లూరు (టౌన్): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో గురువారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు, డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాలల హెడ్‌మాస్టర్లకు సమాచారం పంపాలన్నారు.
అత్యధికంగా లింగసముద్రంలో
179.2 మి.మీ.
అత్యల్పంగా కావలిలో 50.8 మి.మీ.
జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలంలో అత్యధికంగా 179.2 మి.మీ. వర్షం కురిసింది. ఆత్మకూరు 169.8, అనంతసాగరం 149.8, రాపూరు 147.6, దుత్తలూరు 134.8, గుడ్లూరు 133.6, మర్రిపాడు 133.6, కందుకూరు 132.4, సైదాపురం 130.4, ఉలవపాడులో 126.4, కొండాపురం 116.2, అనుమసముద్రంపేట 111, సంగం 105.4, కలువాయి 105, వింజమూరు 104.4, మనుబోలు 99.6, చేజర్ల 99, వరికుంటపాడు 98.6, ఉదయగిరి 97.4, వెంకటాచలం 94.2, పొదలకూరు 92.8, నెల్లూరు అర్బన్ 92.6, జలదంకి 90.4, నెల్లూరు రూరల్ 80.6, ముత్తుకూరు 79, కోవూరు 78.8, దగదర్తి 76.4, వలేటివారిపాళెం 75.8, కొడవలూరు 74.4, బుచ్చిరెడ్డిపాళెం 73.8, కలిగిరి 61.8, సీతారామపురం 59.8, విడవలూరు 59.6, ఇందుకూరుపేట 57.4, బోగోలు 57.4, అల్లూరు 54.6, తోటపల్లిగూడూరు 51, కావలి 50.8 మి.మీ. మేర వర్షపాతం నమోదైంది.

జిల్లా అంతటా భారీ వర్షాలు

జిల్లా అంతటా భారీ వర్షాలు

జిల్లా అంతటా భారీ వర్షాలు