అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(క్రైమ్): ‘ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా భద్రతా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరుల కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉంది’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పి ంచారని, వారి త్యాగాలు మరువలేనివన్నారు. ఎస్పీ అజిత మాట్లాడుతూ దేశ రక్షణ విధుల్లో అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదిమంది మృతిచెందారని వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. తొలుత కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘ నాయకులు తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు సిబ్బంది స్మృతి పరేడ్‌ను నిర్వహించారు. అమరవీరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్, హ్యుమానిటీ కార్పస్ ఫండ్ చెక్కులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పోలీసు కవాతు మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు అమరవీరుల సంస్మరణ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి


