
కూటమి పాలనంతా అవినీతిమయం
వెంకటాచలం: రాష్ట్రంలో కూటమి పాలనంతా అవినీతిమయం అయిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్‌పూర్‌లో సోమవారం కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో చంద్రబాబు, టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధిపై దృష్టి సారించిన పాపాన పోలేదన్నారు. జిల్లా అడ్డాగా పేదల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ నెల నెలా రూ.కోట్ల కొల్లగొట్టుతున్నా.. పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. పేదల రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందని నిత్యం పత్రికల్లో, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నా, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను పట్టించుకోకుండా పరిపాలన సాగించడంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలియజేశారు. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఆశించిన డీఏలు, పెండింగ్ బకాయిల విషయంలో ఊసురుమనిపించారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తూ, కోట్లాది రూపాయల దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ దోపిడీ గురించి ఆధారాలతో సహా బయటపడుతున్నా అధికారులు పట్టించుకోకపోడం సరికాదన్నారు. సోమిరెడ్డి, అతని కుమారుడుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో లేకపోయినా తాము నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల తండ్రిని కోల్పోయిన పాములూరు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, గాయపడిన మాజీ ఎంపీటీసీ సుందరరామిరెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పేదల రేషన్ బియ్యం
అక్రమ రవాణాపై చర్యలు శూన్యం
గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయల దోపిడీ
దీపావళి కానుకగా ఉద్యోగులకు దగా
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి