ఆర్టీసీ బస్సు బోల్తా
జలదంకి(కలిగిరి): మండలంలోని 9వ మైలు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి చామదలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. 9వ మైలు సమీపంలో ఒక్కసారిగా ఎదురుగా లారీ రావడంతో బస్సును డ్రైవర్ పక్కకి తిప్పాడు. దీంతో అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో తక్కువ మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జలదంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


