వృద్ధురాలిని అనాథలా వదిలేసి..
● అనారోగ్యంతో మృతి
● మంట కలిసిన మానవత్వం
మనుబోలు: ఆ వృద్ధురాలికి కుటుంబం ఉంది. ఆమె బాగోగులు పట్టించుకోకుండా మనుమడు మరో ఊరిలో వదిలేశాడు. అనారోగ్యంతో చనిపోయిన వృద్ధురాలికి రెవెన్యూ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మనుబోలు సచివాలయం – 2 వద్ద సర్వీస్ రోడ్డు ఆనుకుని నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేశారు. మృతురాలిని కలువాయికి చెందిన సుబ్బమ్మగా గుర్తించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు ఉండొచ్చని, ఇద్దరు కుమార్తెలున్నారని చెబుతున్నారు. పదిరోజుల క్రితం ఆమె మనుమడు బలవంతంగా ఇక్కడ వదిలివెళ్లగా యాచన చేస్తూ బతికింది. కాగా అనారోగ్యంతో మృతిచెందినట్లు చెబుతున్నారు. పోలీసులిచ్చిన సమాచారంతో బంధువు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో మనుబోలులో మృతదేహాన్ని ఖననం చేశారు.


