
కాపుల హత్యలకు పవన్‌కళ్యాణ్‌దే బాధ్యత
● ఆయన మాట వినే కాపులంతా
టీడీపీకి ఓట్లు వేశారు
● అదే కాపులను నడిరోడ్డుపై దారుణంగా చంపుతున్నా స్పందన లేదు
● లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం దారుణం
● దారకానిపాడు ఎవరూ వెళ్లకుండా పోలీస్ ఆంక్షలు విధించి
అడ్డుకోవడమేంటి
● వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి
కందుకూరు: డీసీఎం పవన్‌కళ్యాణ్ మాటవిని టీడీపీకి ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి కారణమైన కాపులను కుల వివక్షతో నడిరోడ్డుపై చంపుతుంటే పవన్‌కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్లూరు మండలం దారకానిపాడులో దారుణ హత్యకు గురైన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఆయన వచ్చారు. అయితే దారకానిపాడు వెళ్లడానికి వీల్లేదంటూ కందుకూరు పట్టణ బైపాస్‌పైనే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన భార్యను లైంగికంగా వేధిస్తుండడంతో అడిగినందుకు ముగ్గురు అన్నదమ్ములను కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించడంతో అందులో లక్ష్మీనాయుడు చనిపోయాడని, ఇది అత్యంత అరాచకమైన చర్య అన్నారు. లక్ష్మీనాయుడుకి పొన్నూరుతో బంధుత్వం ఉందన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పొన్నూరులోని కాపు సామాజికవర్గ నాయకులంతా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారన్నారు. అయితే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దారకానిపాడు గ్రామానికి వెళ్లకుండా కందుకూరు పట్టణ సమీపంలోనే పోలీసులు ఆపేస్తున్నారన్నారు. భారీగా పోలీసులను మోహరించి గ్రామంలో అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
దారకానిపాడు ఏమైనా పాకిస్తానా
లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు పొన్నూరు నుంచి అంబటి మురళితోపాటు, పలువురు కాపు నేతలు పెద్ద ఎత్తున మంగళవారం తరలివచ్చారు. అయితే దారకానిపాడు వెళ్లడానికి వీల్లేదంటూ వీరిని కందుకూరు బైపాస్ వద్దనే డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐలు అన్వర్‌బాషా, మంగారావు, పలువురు ఎస్సైలు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీస్ అధికారులకు, అంబటి మురళికి మధ్య వాగ్వాదం జరిగింది. దారుణ హత్యకు గురైన బాధితులను పరామర్శిస్తే తప్పేంటని, దారకానిపాడు ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా అంటూ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే నిలబడిన కాపు నేతలు నిరసన వ్యక్తం చేశారు. మురళితో పాటు, ఇతర నేతలను దారకానిపాడు తీసుకెళ్తామంటూ పోలీస్ వాహనం ఎక్కించి అక్కడి నుంచి పామూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీన్ని పసిగట్టిన నేతలు వాహనం దిగి పోలీసులతో వాదనకు దిగారు. తమ ప్రాథమిక హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని ఇది సరైన విధానం కాదంటూ నిలదీశారు. దాదాపు రెండు గంటల ఉద్రిక్తత వాతావరణం తరువాత పోలీస్ ఆంక్షలను నిరసిస్తూ కాపు నేతలు అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది.
టీడీపీ హయాంలోనే కాపుల హత్యలు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటే కాపుల హత్యలు జరుగుతుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగానే వంగవీటి రంగాను అతిదారుణంగా చంపారన్నారు. రంగా స్ఫూర్తితో ముద్రగడ పద్మనాభం ఎదుగుతున్న సమయంలో 2014–19 మధ్యలో ఆయన్ను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో అందరికీ తెలిసిన విషయమేనని వివరించారు. ప్రస్తుతం లక్ష్మీనాయుడు వంటి కాపు యువత పవన్‌కల్యాణ్ స్ఫూర్తితో టీడీపీకి ఓటు వేశారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కాపుల ఆశలు నెరవేరలేదు గానీ పవన్‌కళ్యాణ్ ఆశలు మాత్రం నెరవేరాయని చెప్పారు. డీసీఎంగా ఉన్న ఆయన కనీసం లక్ష్మీనాయుడు హత్యపై కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.